అనువాద తీర్పులు కాదు.. తెలుగులో తీర్పులు కావాలి

 

భారతీయ న్యాయవ్యవస్థలో భాష అనేది అవరోధ సమస్యగా నిరంతర సవాలుగా పరణమించింది. ఈ సమస్య జిల్లా న్యాయవ్యవస్థలో ఉంది. రాజ్యాంగ కోర్టుల్లో ఉంది.  ప్రత్యేకించి రాజ్యాంగ కోర్టుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆ కోర్టుల్లో ఆంగ్లం.. ప్రాథమిక సమాచార మాధ్యమంగా పనిచేస్తోంది. ఈ సమస్యను భారత ప్రధాన న్యాయమూర్తి పలు సమావేశాల్లో లేవనెత్తారు. 

భారతీయ న్యాయస్థానాల్లో ల్యాండ్​స్కేప్​ టెక్నాలజీ  అన్న అంశంమీద చండీగఢ్​ జ్యుడీషియల్​ అకాడమీలో మాట్లాడుతూ ఈ అంశాన్ని  భారత ప్రధాన  న్యాయమూర్తి   డీవై చంద్రచూడ్​ మరోసారి  గత నెలలో  ప్రస్తావించారు.  భారతదేశంలో 22 అధికారికంగా గుర్తించిన భాషలు ఉన్నాయి. వందలాది మాండలికాలలో భాషాపరంగా కూడా వైవిధ్యం ఉన్న దేశం మనది. ఈ వైవిధ్యం సాంస్కృతిక  గొప్పతనానికి మూలం. అయితే, ఇది న్యాయవ్యవస్థలో ముఖ్యమైన సవాళ్లని  లేవనెత్తుతోంది.  

సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులలో ప్రధానమైన భాష  ఇంగ్లీషు.  ఈ భాషని దేశంలోని చాలా ప్రజలు అర్థం చేసుకోలేరు.  దానివల్ల భాష అనేది న్యాయం చేరువకావడంలో ఒక అవరోధంగా పరిణమించింది.  కోర్టు విచారణలని,  కోర్టు తీర్పులని, ఆదేశాలని ఈ న్యాయ ప్రక్రియలో భాగస్వాములైన  వ్యక్తులు అర్థం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. 

ఈ భాషా విరోధం వల్ల పౌరులు, పరాయీకరణ  భావనకి లోనవుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు.  ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే రాజ్యాంగ సంస్థలతో ప్రజలకి సంబంధం ఉండాలి. ఈ విషయంలో న్యాయవ్యవస్థ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందుకే సాంకేతికతను ఉపయోగించి తీర్పులను  ప్రాంతీయ భాషల్లోకి తీసుకుని రావడానికి సుప్రీంకోర్టు కృషి చేస్తుందని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్​ అన్నారు. 

ప్రాంతీయ భాషల్లో తీర్పులకు సుప్రీంకోర్టు కృషిప్రాంతీయ భాషల్లో అందరికీ ఉచితంగా తీర్పులు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పుల  డిజిటల్​ వెర్షన్​ని అందించడానికి భారత సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్​ సుప్రీంకోర్టు రిపోర్ట్స్​  (ఈ‌‌‌‌‌‌‌‌–ఎస్​సీఆర్) ప్రాజెక్టుని ప్రారంభించింది.  ఇంగ్లీషు భాష  ఇప్పుడున్న అవతారంలో  దేశంలోని 99.9శాతం ప్రజలకి అర్థం కావడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు.  అందుకని తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి తీసుకుని రావడానికి సుప్రీంకోర్టు కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కృషిని భారత ప్రధాని కూడా ప్రశంసించారు. 

ఇంగ్లీషు మాట్లాడని ప్రజల ప్రయోజనాల కోసం ప్రాంతీయ భాషల్లో తీర్పులను వెలువరించాలని మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు. గత సంవత్సరం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరెన్ రిజిజు న్యాయస్థానాల్లో  భారతీయ భాషలను వినియోగించాలని  అన్నారు. ఇప్పటికీ దేశంలోని 5 హైకోర్టులు హిందీని ఉపయోగిస్తున్నారు. చట్టం బాగా తెలియని న్యాయవాదులు, ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం వల్ల సుప్రీంకోర్టులో రాణిస్తున్నారని అన్నారు. 

 ఫీజులు కూడా అధికంగా తీసుకుంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను సాంకేతికత ద్వారా అనువాదం చేయడానికి ప్రయత్నాలను చేస్తోంది. కానీ, హైకోర్టుల్లో తెలుగు వాడడానికి కృషి చేయడం లేదు. కనీసం వాదనలను ప్రాంతీయ భాషల్లో చెప్పడానికి ప్రోత్సహించడం లేదు. ఇంగ్లీషు అనేది ఆ హైకోర్టుల్లో అధికార భాష అయినప్పటికీ తెలుగులో వాదనలు వినిపించవచ్చు. ఇద్దరు, ముగ్గురు మినహా మిగతా న్యాయమూర్తులందరూ తెలుగు వచ్చినవారే. 

హిందీ, ప్రాంతీయ భాషల వాడకం

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 (1) ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కార్యకలాపాలు పార్లమెంట్ ద్వారా చట్టం చేసి అనుమతించే వరకు ఇంగ్లీషులోనే ఉండాలి. అదేవిధంగా ఆర్టికల్​ 348 (2) ప్రకారం హైకోర్టు కార్యకలాపాలు,  తీర్పులు, ఆదేశాలు ఆంగ్లంలో ఉండాలి. రాష్ట్రపతి, గవర్నర్ పూర్వ అనుమతితో హైకోర్టు కార్యకలాపాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం హిందీ భాషలోగానీ అదేవిధంగా ఇతర భాషలోనూ ఉపయోగించవచ్చు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్​, బిహార్, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల హైకోర్టులలో తీర్పులను, డిక్రీలను హిందీలో ఉపయోగించడం చాలాకాలం క్రితమే ఆమోదం పొందినది. మద్రాస్​ హైకోర్టు, చత్తీస్​గఢ్, గుజరాత్​ హైకోర్టుల్లో విచారణలని తమ ప్రాంతీయ భాషల్లో ఉపయోగించుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఆయా ప్రభుత్వాలు పంపించిన ప్రతిపాదనలను భారత ప్రభుత్వం అందుకుంది. 1965వ సంవత్సరంలోని కేబినెట్​ కమిటీ నిర్ణయం ప్రకారం హిందీకాని ఇతర ప్రాంతీయ భాషల వినియోగం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం అవసరం.  2012వ సంవత్సరంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. 

ప్రజలకు కావాల్సింది తమ భాషల్లో తీర్పులు 

ఆ సదస్సు స్ఫూర్తితో మరికొంతమంది న్యాయమూర్తులు తెలుగులో తీర్పులను వెలువరించారు. ఆ తరువాత కొంతకాలానికి యధావిధిగా మామూలు పరిస్థితి వచ్చేసింది. గత సంవత్సరం నేను మళ్లీ తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్​ అకాడమీ డైరెక్టర్​గా బాధ్యతలు స్వీకరించి ఓ సంవత్సరం కాలంపాటు పనిచేశాను. నేను ఇచ్చిన స్ఫూర్తితో  మరి కొంతమంది న్యాయమూర్తులు తెలుగులో తీర్పులను వెలువరించారు. వెలువరిస్తున్నారు. అంతకు కొద్దిరోజులు ముందు హైకోర్టు న్యాయమూర్తులు  నవీన్​రావు, నగేష్​ భీమపాకలు  తెలుగులో తీర్పుని వెలువరించారు. తెలంగాణ రాష్ట్రంలో  నాకు  తెలిసి రంగారెడ్డి  జిల్లా జడ్జి శశిధర్ రెడ్డి తెలుగులో సాక్షుల వాంగ్మూలాలని క్రమం తప్పకుండా నమోదు చేస్తున్నారు.  

తెలుగులో  వాంగ్మూలాలని నమోదు చేయడం,  తీర్పులను  ప్రకటించడం అన్న  ప్రక్రియ నిరంతరం జరగాలి. అప్పుడే న్యాయవ్యవస్థ  ప్రజలకి చేరువ కావడానికి అవకాశం ఏర్పడుతుంది.  భాష అనేది భావ వ్యక్తీకరణకు ఓ విధానం.  సమాచారం తెలుసుకోవడానికి, అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనడానికి అత్యంత అవసరమైనది. 

భాష అనేది న్యాయానికి అవరోధంగా మారకూడదు. ప్రాంతీయ భాషల్లో తీర్పులు వల్ల కోర్టులు ప్రజలకు చేరువ అవుతాయి. సాంకేతికత ఆధారంగా చేసే అనువాదాల్లో కృత్రిమత్వం ఉంటుంది. అవి ప్రజలకు చేరువ కావడానికి  బదులు దూరం చేస్తాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు గుర్తించారు. ప్రజలకు కావాల్సింది తీర్పుల అనువాదాలు కాదు.  తమ భాషలలో తీర్పులు. ఈ విషయాన్ని ఎంత త్వరగా అమలుచేస్తే భాషకే కాదు. ప్రజలకు సేవ చేసినవారు అవుతారు.

ప్రాంతీయ భాషల్లో తీర్పుల ఆవశ్యకత

నేను నిజామాబాద్​లో పనిచేస్తున్నప్పుడు అప్పటి అధికార భాష కమిషన్ చైర్మన్​ కొన్ని తెలుగు మోడల్​ తీర్పులు కావాలని కోరారు. మోడల్​ తీర్పులు ఎందుకు.. నిజమైన తీర్పులనే ఇస్తానని వరుసగా తెలుగులో తీర్పులను ప్రకటించాను.  ఇది జులై 2006వ  సంవత్సరంలో జరిగింది. ఆ తీర్పుల స్ఫూర్తితో  మరి కొంతమంది న్యాయమూర్తులు  తెలుగులో  తీర్పులను  వెలువరించారు.  కొంతకాలం తరువాత మళ్లీ మామూలైపోయింది. ఆ తరువాత నేను ఆంధ్రప్రదేశ్​ జ్యుడీషియల్​ అకాడమీలో  సీనియర్​ ఫ్యాకల్టీ మెంబర్​గా  పనిచేస్తున్నప్పుడు 10 ఫిబ్రవరి 2013వ సంవత్సరంలో ‘తెలుగులో న్యాయపాలన’ అన్న సదస్సు జరిగింది.  ఈ సదస్సుని అధికార భాషా సంఘం,  జ్యుడీషియల్​ అకాడమీ సంయుక్తంగా నిర్వహించారు.

ఒక రోజంతా జరిగిన ఈ సదస్సులో ఉభయ రాష్ట్రాలలోని న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్​రెడ్డి,  అప్పటి రాష్ట్ర  ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్​ పినాకి చంద్రఘోష్,  జస్టిస్​ ఎన్​వి రమణ,  అధికార భాషా సంఘం  అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్​తదితరులు పాల్గొన్నారు.  ‘తెలుగులో న్యాయపాలన’  పుస్తకాన్ని వెలువరించారు. ఈ వ్యాసకర్త  దాని రచయిత.  ఆ ఆవిష్కరణ వార్త ఓ ప్రధాన పత్రికలో బ్యానర్ ​వార్తగా రావడం ఓ విశేషం.

- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్​)​-