ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీకి దూరం తగ్గించడంతో పాటు జర్నీ సమయాన్ని కూడా తగ్గించడం కోసం కొత్త ఎక్స్ ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం సన్నద్ధమైంది. దాదాపు 1350 కిలోమీటర్ల దూరం గల ఈ ఎక్స్ ప్రెస్‌వేను రూ.లక్ష కోట్ల బడ్జెట్‌తో పూర్తిచేయనున్నారు. ఐదు రాష్ట్రాల మీదుగా సాగే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ముంబై-ఢిల్లీ మధ్య దూరం 350 కిలోమీటర్ల వరకు తగ్గనుంది. కరోనా కారణంగా పనులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. ఈ ప్రాజెక్టును 2023 జనవరి కల్లా పూర్తిచేయాలని నిర్ణయించారు.
ముంబై-న్యూఢిల్లీ మధ్య ఎక్స్ ప్రెస్‌వే పనుల కోసం మొదట ఆరు లైన్‌లతో రోడ్డు నిర్మాణం చేపట్టానున్నారు. ఆ తర్వాత మరో నాలుగు లైన్‌ల పనులను చేపడతారు. ఈ నాలుగు లైన్‌ల్లలో ఎలక్ట్రిక్ వాహనాలను నడిపేందుకు మాత్రమే కేటాయించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ముంబై నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇప్పుడు ఇదే దూరాన్ని పూర్తిచేయడానికి దాదాపు 25 గంటల సమయం పడుతోంది. ఈ ఎక్స్ ప్రెస్‌వే వెంబడి కాలుష్యాన్ని నివారించేలా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్, స్మార్ట్ సిటీస్ కూడా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. ఈ రోడ్డులో మొత్తం 92 ప్రాంతాలను ఇంటర్వెల్ స్టాప్స్ గా తయారు చేయనున్నారు.
