రెండో రోజూ కొనసాగిన కంది రైతుల ఆందోళన

  • 5 గంటల పాటు రోడ్డుపై బైఠాయింపు 
  •  మద్దతు ధర హామీతో విరమణ

నారాయణపేట, వెలుగు : కంది రైతుల ఆందోళన రెండోరోజూ కొనసాగింది. నారాయణ పేట జిల్లా కేంద్రంలో కంది ధరను క్వింటాల్ కు రూ.1500 నుంచి రూ.2,000 వరకు వ్యాపారస్తులు తగ్గించడంతో తమకు అన్యాయం జరుగుతుందని సోమవారం మార్కెట్​యార్డు ఆఫీసు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాలతో అధికారులు చర్చలు జరిపినా ఫలించలేదు. కంది రైతులు ధాన్యం మార్కెట్ లోకి తీసుకురాకుండా అడ్డుకుని రాస్తారోకో చేశారు. రైతులకు ధర రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

వెంటనే కలెక్టర్ స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ– నామ్​ మార్కెట్​లో ధరలు తగ్గడంతోనే వ్యాపారులు తగ్గించారని, అధికంగా రూ.200 ఇస్తామని, రైతులు అమ్మకాలకు సహకరించాలని మార్కెట్​చైర్మన్​సదాశివారెడ్డి కోరినా వినలేదు.  ఆందోళనకు రైతు సంఘ నేతలు మద్దతు తెలపడంతో రాస్తారోకో గంటల పాటు కొనసాగింది. మంగళవారం హైదరాబాద్​నుంచి వచ్చిన వ్యవసాయశాఖ డీడీఎం ప్రసాద్, ఆర్డీవో రాంచందర్, ఏడీఎం బాలమణి మరోసారి రైతులు, వ్యాపారులో చర్చించారు. చివరికు క్వింటాలుకు రూ.250 ఇస్తామని చెప్పటంతో రైతులు శాంతించారు. రాస్తారోకో దాదాపు 5 గంటలపాటు కొనసాగగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.