- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
వర్షాకాలం ముగయగానే ఢిల్లీలో పొల్యూషన్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. గాలిలో దుమ్ము, పొగతో నిండిపోయి ఎయిర్ క్వాలిటీ లెవల్స్ రోజు రోజుకీ ఘోరంగా పడిపోతున్నాయి. గాలిలో కాలుష్యం ఎంతుందనేది చెప్పే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో 300 దాటిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఆ గాలి పీలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతినడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ కు చర్యలు ప్రారంభించింది. ఢిల్లీలో ఇవాళ్టి (అక్టోబర్ 15) నుంచి డీజిల్, కిరోసిన్, పెట్రోల్ జనరేటర్ల వాడకాన్ని నిషేధిస్తూ బుధవారం ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి చిన్న ప్రయత్నమూ ముఖ్యమే
కాలుష్య నివారణ చర్యల్లో ప్రతి చిన్న ప్రయత్నమూ ముఖ్యమేనని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాలుష్యంతో యుద్ధం’ అనే పేరుతో క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ‘రెడ్ లైట్ ఆన్.. గాడీ ఆఫ్’ అన్న నినాదమిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ లో ఉండగా రెడ్ సిగ్నల్ పడితే వెహికల్ ఇంజన్ కచ్చితంగా ఆపేస్తామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని కేజ్రీవాల్ కోరారు. దీని ద్వారా ఎంత పొల్యూషన్ తగ్గుతుందిలే అని అశ్రద్ధ చేయద్దని, ప్రతి చిన్న ప్రయత్నమూ మనకు మేలు చేస్తుందని చెప్పారాయన.
టన్నుల కొద్దీ కాలుష్యం తగ్గించొచ్చు
‘ఢిల్లీలో కోటి వెహికల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటిలో సుమారు 40 లక్షల వాహనాలు ప్రతి రోజూ రోడ్డు మీదకు వస్తాయి. అవన్నీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు కూడా ఇంజన్ రన్ అవుతూనే ఉంటే గాలి కాలుష్యం పెరిగిపోతుంది. ఒక్కో వెహికల్ రోజు మొత్తం సగటున 15-20 నిమిషాల వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆగుతుంది. ఈ సమయంలో ఇంజన్ 200 ml ఆయిల్ ను లాగేస్తుంది. సిగ్నల్స్ దగ్గర ఆగే కొద్ది టైమ్ లో గాలిలోకి విడుదలయ్యే పొగ వల్లే ఏటా దాదాపు 4 టన్నులకు పైగా కాలుష్యం విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. రెడ్ సిగ్నల్ పడిన సమయంలో ఇంజన్ ఆపితే ఇంత భారీ మొత్తంలో పొల్యూషన్ ను మనం తగ్గించొచ్చని అందరూ గుర్తుంచుకోవాలి’ అని కేజ్రీవాల్ చెప్పారు. సిగ్నల్ దగ్గర ఇంజన్ ఆపడం ద్వారా పొల్యూషన్ ను తగ్గించడంతో పాటు ఏడాదిలో సుమారు 80 లీటర్లకు పైగా ఆయిల్ సేవ్ చేయడం ద్వారా ఒక్కొక్కరు రూ.7 వేల వరకు డబ్బులు ఆదా చేయొచ్చని అన్నారు.
ఘోరంగా ఎయిర్ క్వాలిటీ
ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ లెవల్స్ ఘోరంగా పడిపోతున్నాయి. గాలిలో పొల్యూషన్ ను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా లెక్కగడతారు. AQI లెవల్ సున్నా నుంచి 50 మధ్యలో ఉంటే ఆ గాలి పీల్చుకోవడానికి మంచి క్వాలిటీ ఉన్నట్లు లెక్క. అదే 51-100 మధ్య ఉంటే పొల్యూషన్ లెవల్స్ తక్కువగా ఉన్నట్లు అర్థం. మనుషులు పీల్చుకోవడానికి పర్లేదు. AQI లెవల్ 101-200 మధ్య ఉంటే మధ్యస్థంగా ఉందని, 201-300 మధ్య ఉంటే ఘోరం, 301-400 చాలా ఘోరంగా ఉందని అర్థం. ఇక AQI లెవల్ 401-500 మధ్య ఉంటే ఆ గాలి పీలిస్తే రోగాలు ఖాయమని అర్థం. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని అనేక ఏరియాల్లో AQI లెవల్ 300 దాటిపోయింది. గురువారం ఉదయం ఐటీవో, వివేక్ విహార్ ఏరియాల్లో AQI లెవల్ 370గా నమోదైంది. షాదీపూర్ లో 359గా రికార్డ్ అయింది. గ్రేటర్ నోయిడాలో AQI 344గా ఉంటే ఘజియాబాద్ 326, ఫరీదాబాద్ 317 నమోదైంది. ఢిల్లీ, ఎన్సీఆర్ లో పొల్యూషన్ ఇంకా పెరుగుతూనే ఉంటే ఢిల్లీ పరిసరాల్లోని ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్, హాట్ మిక్స్ ప్లాట్లను మూసేయాలని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అలాగే బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్లను వీలైనంత వరకు మూసేసి, గ్యాస్ ద్వారా పవర్ జనరేషన్ చేయాలని భావిస్తోంది.
