చల్లటి ప్రాంతం మండుతోంది

చల్లటి ప్రాంతం మండుతోంది

ప్రపంచంలోనే ఎంతో చల్లగా ఉండే ఆర్కిటిక్​ సర్కిల్​, గ్రీన్​ల్యాండ్​లలో ఉవ్వెత్తున ఎగిసిన ఎర్రటి మంటలివి. ఆర్కిటిక్​ సర్కిల్​లో ఉండే నార్వే, స్వీడన్​, ఫిన్లాండ్​, రష్యా, డెన్మార్క్​, ఐస్​ల్యాండ్​లను ప్రపంచంలో చల్లటి ప్రదేశాలుగా చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఆ చల్లటి ప్రాంతాల్లోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో కార్చిచ్చు రాజుకుంది. అక్కడ భారీగా పెరుగుతున్న టెంపరేచర్లే ఇంతటి మంటలకు కారణమవుతున్నాయి. ఆర్కిటిక్​ సర్కిల్​లో ఇంతటి మంటలు ఎప్పుడూ రాలేదని, కార్చిచ్చు రాజుకోవడాన్ని కనీసం ఊహించుకోనూ లేదని కోపర్నికస్​ అట్మాస్ఫియర్​ మానిటరింగ్​ సర్వీస్​ సీనియర్​ సైంటిస్ట్​ మార్క్​ పారింగ్టన్​ చెప్పారు. అలస్కా, సైబీరియా, కెనడాల్లో వీస్తున్న వడగాడ్పులే అందుకు కారణమవుతున్నాయన్నారు. ఈ మంటల వల్ల గ్రీన్​ల్యాండ్​లోని ఐస్​ కూడా వేగంగా కరిగిపోతోంది.

ఒక్క రోజే 1200 కోట్ల టన్నులు..

గురువారం ఒక్క రోజే 1200 కోట్ల టన్నుల గ్రీన్‌ల్యాండ్‌ ఐస్​ కరిగి నీరుగా మారిపోయింది. ఆ నీళ్లన్నీ సముద్రంలో కలిసిపోయాయి. జులై 31న ఎన్నడూ లేనంతగా 60 శాతం ఐస్​ షీట్​ కరిగిపోయింది. జులై మొత్తంలో దాదాపు 19,700 కోట్ల టన్నుల మంచు కరిగి అట్లాంటిక్​ మహాసముద్రంలో కలిసిపోయాయని డెన్మార్క్​ వాతావరణ కేంద్రం నిపుణుడు రూత్​ మోట్రమ్​ తెలిపారు. ఒక నెలలో సముద్ర మట్టం 0.01 మిల్లీమీటర్​ పెరగడానికి ఈ నీళ్లు చాలని చెప్పారు. సముద్ర మట్టం పెరిగే కొద్దీ తుఫాన్లు పెరిగిపోతాయని, దాని వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.