చింతాత.. జితా.. జితా.. .. హైదరాబాద్ లో ఎర్ర చింతకాయల చెట్టు  ఎక్కడో తెలుసా..

చింతకాయ ఏ కలర్ లో ఉంటుంది అని ఎవరినైనా అడిగితే మీకేమైనా మతి పోయిందా? అది కూడా తెలియదా? ఆకుపచ్చ రంగులో అంటారు కదా! కానీ.. ఈ గల్లీలో పిల్లలను అడిగితే మాత్రం 'ఎర్రగుంటది' అని సమాధానమిస్తున్నరు. ఎందుకంటే ఈ ఏరియాలో నిజంగానే ఎర్ర చింతకాయలు కాసే చెట్టుంది. వినడానికి కాస్త పులుపుగా ఉన్నా ఇది నిజం.

 ఈ చెట్టుకున్న మరో ప్రత్యేకత ఏంటంటే దాని వయసు... వంద ఏళ్లుపైగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఈ అరుదైన ఎర్ర చింతకాయ చెట్టు చేర్యాలలో ఉంది. చెట్టుకు కాసే చింతకాయలుపైన మామూలుగానే ఉన్నా లోపల మాత్రం ఎర్రగా ఉంటాయి. రుచి కూడా చాలా పుల్లగా ఉంటుంది. ఈ చెట్టు వానగాయలను గిచ్చితే గోళ్లకు, వేళ్లకు ఎర్ర రంగు అంటుకుంటుంది. తింటే నోరంతా ఎర్రగా మారుతుంది. ఈ దగ్గరలో గవర్నమెంట్ జూనియర్, డిగ్రీ కాలేజ్ లు, గవర్నమెంట్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో చదువుకునే స్టూడెంట్స్ అంతా ఈ చెట్టుకు కాసే చింతకాయలను తెంపి తింటూ... సరదాగా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆడుకుంటుంటారు. 

ఒకప్పుడు ఇక్కడ ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది. వినాయక చవితి పండుగ, దీపావళి పండుగలప్పుడు అంతా ఈ ఎర్ర చింతకాయల పులుపు కోసం ఆరాటపడతారు. క్లాసులు ఎగ్గొట్టే స్టూడెంట్స్కు ఈ ఎర్ర చింతచెట్టే అడ్డా. అయితే వందేళ్ల వయసున్న ఈ అరుదైన చెట్టును కాపాడాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు..


ఎర్ర చింతపండుతో తయారైన వివిధ ఉత్పత్తులు

మామూలు చింత రకాలకు  భిన్నంగా ఎర్ర చింత రకాన్ని  శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు.   ఒక చెట్టు కాయల్లో గుజ్జు ఎర్రగా ఉన్నట్లు, ఈ చెట్టు ప్రతి ఏటా కాయలు కాస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.  దీనికి ‘ఛాంపియన్‌ ట్రీ’ అని పేరు పెట్టారు. ఈ చెట్టు కొమ్మల ద్వారా అంట్లను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తున్నారు.  అవి పూతకు వచ్చిన తర్వాత ఆ చెట్లకు కూడా అంట్లు కట్టడం ప్రారంభిస్తారు. ఎర్ర చింత చెట్టు    ప్రతి ఏటా కాపు కాస్తున్నది. కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పిందెను విరిచి చూస్తే రక్తం మాదిరిగా ఎర్రగా కండ కనిపిస్తుంది. కాయ ముదిరిన తర్వాత రోజ్‌ రెడ్‌లోకి మారుతుంది. యాంటోసైనిన్స్‌ అనే పిగ్‌మెంట్‌ కారణంగా ఎరుపు రంగు సహజసిద్ధంగానే వస్తుంది.

ఎర్ర చింత.. ఆరోగ్యదాయకం 

మామూలు చింత రకాల నుంచి వచ్చే చింతకాయల ద్వారా చింతతొక్కు, చింతపండుగానే ఎక్కువగా ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే, ఎర్రచింతతో అనేక ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ రకం చింతపండు, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యపరంగా మనిషి ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ (చెడు కలిగించే పదార్థాల)ను ఇవి నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇందులో టార్టారిక్‌ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్‌ లాంటి విటమిన్లు, మినరల్స్‌(ఖనిజాలు) ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా టార్టారిక్‌ యాసిడ్‌ 16 శాతం ఉంటుంది. దీన్ని చింత తొక్కుగా, చింతపండుగా వంటకాల్లో వాడితే మంచి రుచిని ఇస్తుందన్నారు.

ఆకర్షణీయంగా ఆహారోత్పత్తులు

ఎరుపు రంగు ఆక్షణీయంగా ఉంటుంది కాబట్టి ఎర్ర చింతపండుతో పులిహోర, సాంబారును మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎర్ర చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్‌(చాక్లెట్లు), బేకరీ పదార్ధాల తయారీలో వాడుకుండే ఆయా ఉత్పత్తులు సహజమైన ఎర్ర రంగుతో అదనపు పోషక విలువలతో కూడి మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎగుమతుల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది.

 ఎర్ర చింత చెట్లు, కొమ్మలు గుబురుగా, దట్టంగా పెరుగుతాయి, కొన్ని దశాబ్దాల పాటు పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కాబట్టి ఎటు చూసినా 8 మీటర్ల దూరంలో చింత మొక్కలు  నాటుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత ఐదో ఏడాది కాపునకు వస్తాయి. పూత వచ్చిన 7–8 నెలలకు పండ్లు తయారవుతాయి. తొలి ఏడాది చెట్టుకు 15–20 కిలోల చింతపండ్ల దిగుబడి వస్తుంది. 10–12 సంవత్సరాల చెట్టు ఏటా 40–50 కిలోల దిగుబడినిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు ఏటా 70–80 కిలోల చొప్పున చింత పండ్ల దిగుబడి వస్తుంది.

చింత పండ్లను సేకరించి పైన పొలు, ఈనెలు, గింజలు తీసేస్తే.. 40–45 శాతం మేరకు నికరంగా చింతపండు చేతికి వస్తుంది. ఏటా కాపు కాయడం ఈ రకం విశిష్టత కావడంతో రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అంటు మొక్కలు నాటుకుంటే 70–80 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. చింత గింజలు నాటితే చెట్లు 10–12 ఏళ్లకు గానీ కాపునకు రావు. కానీ, వందేళ్ల వరకు దిగుబడినిస్తాయి. అయితే, గింజ నాటినప్పటికన్నా అంటు నాటుకున్నప్పుడు జన్యుపరంగా ఖచ్చితమైన నాణ్యమైన చెట్లు రావడానికి అవకాశం ఉందన్నారు.