ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్​లో కుండపోత

ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్​లో కుండపోత

న్యూఢిల్లీ:  ఉత్తరాదిలో వరుసగా రెండో రోజు ఆదివారం కూడా కుండపోత వర్షాలు కురిశాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీ, రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్స్, వరదలు, చెట్లు విరిగిపడి 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో గత 40 ఏండ్లలోనే అత్యధికంగా రికార్డ్ స్థాయి వర్షం కురిసింది. యమునా నది మంగళవారం కల్లా డేంజర్ మార్క్ ను దాటనుందని అధికారులు హెచ్చరించారు. హిమాచల్, ఉత్తరాఖండ్ లలో అతి భారీ వర్షాలు పెను బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నదులన్నీ డేంజర్ లెవల్ లో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన మరికొన్ని ప్రాంతాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. నార్తర్న్  రైల్వేస్ పరిధిలో 17 రైళ్లను రద్దు చేశామని, మరో 12 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. నాలుగు చోట్ల ట్రాకులపై భారీగా వరద నీరు చేరడంతో ట్రెయిన్ల రాకపోకలు నిలిపివేశామన్నారు.  

హిమాచల్ లో ఐదుగురు మృతి  

హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం కుండపోత వర్షాలతో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు, ఇండ్లు నీట మునిగాయి. రాష్ట్రం అంతటా దాదాపుగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అన్ని పెద్ద నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గడిచిన 36 గంటల్లోనే 14 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, 13 చోట్ల ఆకస్మిక వరదలు వచ్చాయని, 700 రోడ్లు బంద్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. మనాలిలో షాపులు, వెహికల్స్ వరద నీటిలో కొట్టుకుపోయాయన్నారు. షిమ్లా జిల్లా కోట్ గఢ్​లో ల్యాండ్ స్లైడ్ కారణంగా ఓ ఇంట్లోని ముగ్గురు చనిపోయారని, కులూ పట్టణంలో ఓ ఇంటిపైనా కొండచరియలు పడటంతో ఓ మహిళ మృతిచెందిందని తెలిపారు. చంబా తహసిల్​లో కొండచరియల కింద ఓ వ్యక్తి సమాధి అయ్యాడన్నారు. చంద్రతాల్, లాహౌల్ అండ్ స్పిటిలో ల్యాండ్ స్లైడ్స్ కారణంగా 200 మంది చిక్కకుపోయారని, ఒకట్రెండు రోజుల్లో అందరినీ తరలిస్తామన్నారు.    

ఉత్తరాఖండ్ లోనూ ఐదుగురు.. 

ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఆదివారం ఐదుగురు మృతి చెందారు. తెహ్రీ గర్వాల్ జిల్లాలో 11 మంది యాత్రికులు ప్రయాణిస్తున్న జీపుపై కొండచరియలు విరిగిపడటంతో ఆ వెహికల్ గంగా నదిలో పడిపోయింది. జీపులో నుంచి ఐదుగురు వ్యక్తులను కాపాడామని, ముగ్గురి డెడ్ బాడీలను రికవరీ చేశామని అధికారులు వెల్లడించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. జీపులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లను ఢిల్లీ, బీహార్, హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించామన్నారు. చెట్లు కూలిపడటంతో కాశీపూర్​లో రెండు ఇండ్లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు దంపతులు చనిపోగా, ఓ చిన్నారి గాయపడిందన్నారు. రాష్ట్రంలోని గంగా నదితో పాటు అన్ని పెద్ద నదుల్లో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరిందంటూ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.   

యూపీలో ముగ్గురు మృతి 

ఉత్తరప్రదేశ్​లోని అనేక ప్రాంతాల్లోనూ ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. బలియా జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు చనిపోయారు. మరోచోట పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.  కాగా, కౌశాంబి ఏరియాలో వర్షాలు, ఈదురుగాలులకు చెట్టు విరిగి రేకుల షెడ్డుపై పడటంతో పదేండ్ల బాలిక చనిపోయిందని తెలిపారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం భారీ వర్షాలు కురిశాయి.  

దేశంలో 8 రోజుల్లోనే అధిక వర్షపాతం   

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. ఈ సీజన్​లో జూన్ చివరి నాటికి 10% లోటు వర్షపాతం (148.6 మి.మీ.) నమోదవగా.. కేవలం 8 రోజుల్లోనే అది సర్ ప్లస్​గా మారిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ సీజన్ లో ఇప్పటివరకు మొత్తం 243.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయిందని, ఇది సాధారణం కంటే 2% ఎక్కువని పేర్కొంది. ఉత్తరాదిన సాధారణం(125.5 మి.మీ.) కంటే 59% ఎక్కువగా(199.7 మి.మీ.).. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నార్మల్(454 మి.మీ.) కంటే17% తక్కువగా(375.3 మి.మీ.) వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.

ఢిల్లీలో 40 ఏండ్లలో ఇదే రికార్డ్ వర్షం  

ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 40 ఏండ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీలో ఆదివారం ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఢిల్లీలో జులై 25, 1982న 24 గంటల్లో 169.9 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, ఆ తర్వాత ఇదే అతి భారీ వర్షమని తెలిపింది. కుండపోత వర్షాల కారణంగా రోడ్లు, అండర్ పాస్ లు, మార్కెట్లు, పార్క్ లు, వీధులన్నీ నీట మునిగాయి. కొన్ని హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు చెరువులను తలపించాయి. అనేక చోట్ల రోడ్లపై వాహనాలు మునిగిపోయే స్థాయిలో నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. ఢిల్లీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదివారం సెలవును రద్దు చేస్తున్నామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మేయర్, మంత్రులంతా సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఢిల్లీలో సీజన్ మొత్తంలో కురవాల్సిన వర్షంలో 15 శాతం వర్షం గడిచిన 12 గంటల్లోనే కురిసిందన్నారు. కాగా, ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్ కు దగ్గరైంది.

వరదలో కొట్టుకుపోయి ఇద్దరు జవాన్లు.. 

జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నాయిబ్ సుబేదార్ కుల్దీప్ సింగ్, లాన్స్ నాయక్ తెలు రామ్ అనే ఇద్దరు జవాన్ల డెడ్ బాడీలను ఆది వారం రికవరీ చేశామని అధికారులు వెల్లడించారు. శనివారం పెట్రోలింగ్ లో భాగంగా సూరన్ కోటే ఏరియాలోని డోగ్రా నాలాను దాటుతుండగా ఆకస్మిక వరద రావడంతో వారు కొట్టుకుపోయారని తెలిపారు. వీరిద్దరూ పంజాబ్ కు చెందినవారని పేర్కొన్నారు.   

బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నయ్ 

హిమాచల్ ప్రదేశ్​లోని మండి జిల్లాలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఆదివారం ఓ బ్రిడ్జి ఇలా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. రాష్ట్రంలో కుండపోత వర్షాల వల్ల నదుల్లో ప్రవాహం భారీ ఎత్తున పెరగడంతో రెండు వైపులా తీరం కోతకు గురవుతోంది. అనేక చోట్ల ఇండ్లు, బ్రిడ్జిలు కూలి కొట్టుకుపోతున్నాయి. కార్లు, బైకుల వంటి వెహికల్స్ కూడా పెద్ద సంఖ్యలో నీటిలో కొట్టుకుపోయాయి.