ధాన్యం సేకరణలో రికార్డు.. దేశంలో నాలుగో ప్లేస్​లో తెలంగాణ

  • ధాన్యం సేకరణలో రికార్డు 
  • దేశంలో నాలుగో ప్లేస్​లో తెలంగాణ
  • నిరుటితో పోలిస్తే సాగు, దిగుబడి, సేకరణలో రికార్డులు
  • ఇప్పటికే 47.01 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లతో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఫస్ట్​ ప్లేస్​లో పంజాబ్ ఉండగా రెండు, మూడు స్థానాల్లో చత్తీస్​గఢ్, హర్యానా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది. దీనికి తోడు దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. సన్న రకాలకు సర్కారు బోనస్​ ఇస్తుండడంతో రైతులు సర్కారు కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకపోయినా రాష్ట్ర చరిత్రలోనే రికార్డులు తిరగరాస్తూ ఈ వానాకాలం సీజన్​లో 66.78 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. బోనస్​ ఎఫెక్ట్​తో ఈ సారి సన్న రకాల సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే 61 శాతం పెరిగింది. గత ఏడాది వరి సాగు విస్తీర్ణంలో 25.05 లక్షల ఎకరాలు (38 శాతం) సన్న రకాలుంటే.. ఈ యేడు వానాకాలంలో 40.45 లక్షల ఎకరాల్లో (61 శాతం) సన్న రకాల వరి సాగు పెరిగింది. గత ఏడాది వానాకాలంలో 40.89 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్ల సాగు జరిగితే ఈ వానాకాలంలో 26.33 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలను సాగు చేశారు. 

47 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు..

గత వానాకాలం సీజన్​లో వరి 65.94 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 66.78 లక్షల ఎకరాలు. నిరుడు వానాకాలం ధాన్యం దిగుబడి అంచనా 146 లక్షల టన్నులు కాగా, ఈయేడు 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే వానాకాలం దిగుబడిలో రైతులు ఆహార అవసరాలు, విత్తనాలకు, ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు పోగా మిగతా ధాన్యం సర్కారు కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో 8,318 కొనుగోలు సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 8.84 లక్షల మంది రైతుల నుంచి రాష్ట్ర సర్కారు 47.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. గతేడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల సేకరణ జరిగింది. ఇప్పటికే రాష్ట్ర సర్కారు రూ.10,149 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. కొన్న 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. ఈయేడు సేకరించిన 47.01 లక్షల టన్నుల ధాన్యంలో 18.78 లక్షల టన్నులు సన్నాలే కావడం గమనార్హం.

దేశంలో నాలుగో స్థానంలో తెలంగాణ

దేశవ్యాప్తంగా కేంద్రం 6.50 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు 4.12 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ చేపట్టింది. దేశ వ్యాప్తంగా 41,65,383 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ.90 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. పంజాబ్​లో అత్యధికంగా 1.73 కోట్ల టన్నుల ధాన్యం సేకరించారు. ఆ తర్వాత చత్తీస్ గఢ్​లో 63.62 లక్షల టన్నులు, హర్యానా 53.93 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. మన రాష్ట్రం నుంచి 47.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించడంతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరుగుతున్నది.