ప్రసవాల్లో సంగారెడ్డి ఆస్పత్రి రికార్డు .. ఈ ఏడాదిలో 7,221 కాన్పులు

  • గత నెలలో 836 అత్యధికం
  • సంగారెడ్డి ఎంసీహెచ్ ఘనత

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రసవాల్లో రికార్డు నెలకొల్పింది. గడిచిన 10 నెలల్లో 7,221 డెలివరీలు చేశారు. అత్యధికంగా అక్టోబర్ లో 836 ప్రసవాలు జరిగాయి.  నిత్యం 30 డెలివరీలు జరిగితే అందులో సగానికి పైగా సాధారణ కాన్పులే ఉంటున్నాయి. బాలింతలు, గర్భిణీలతో ఎప్పుడు సందడిగా ఉండే ప్రభుత్వాస్పత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరగడం ఇక్కడి డాక్టర్ల పనితీరుకు నిదర్శనం. 

అతి క్లిష్టమైన హై రిస్క్ కాన్పులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి నాణ్యమైన వైద్య సేవలు అందడంతో ఎంసీహెచ్ వైద్యుల పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

ఏడాదిలో 7,221 కాన్పులు

సంగారెడ్డి ఎంసీహెచ్ లో అక్టోబర్ నెలలోనే ఏకంగా 836 కాన్పులు జరిగాయి. ఇందులో సాధారణ డెలివరీలు 459 కాగా, సిజేరియన్ 377  చేశారు. ఈ ఏడాదిలో జరిగిన డెలివరీలను పరిశీలిస్తే మొత్తం 7,221 కాగా జనవరిలో  705, ఫిబ్రవరిలో 604, మార్చిలో 673, ఏప్రిల్ లో 759, మేలో 782, జూన్ లో 645, జూలై లో 706, ఆగస్టులో 799, సెప్టెంబర్ లో 712, అక్టోబరులో 836 ప్రసవాలు జరిగాయి. 

Also Read :- భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే

హై రిస్క్ లో సక్సెస్

సంగారెడ్డి ఎంసీహెచ్ డాక్టర్లు హై రిస్క్ లో ఆపరేషన్ చేస్తూ సక్సెస్ అయ్యారు. మాతా, శిశు మరణాలు జరగకుండా గర్భిణీలకు సుఖ ప్రసవం జరిగేలా ప్రోత్సహిస్తున్నారు. 15 రోజుల కింద నర్సమ్మ అనే మహిళ 8 నెలల గర్భంతో రెండో కాన్పు కోసం ఎంసీహెచ్ కు రాగా ఆమెను డాక్టర్లు పరిశీలించగా గర్భంలోనే శిశువు చనిపోయింది. గర్భసంచి నుంచి విడిపోయి తీవ్ర రక్తస్రావం కాగా ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర శస్త్ర చికిత్స చేసి 30 యూనిట్ల రక్తం, ఎఫ్ఎఫ్ పి రక్త కణాలను ఎక్కించి తల్లి ప్రాణాలను కాపాడారు. అనుభవం గల గైనకాలజిస్టులు అనస్తీషియా, చిన్న పిల్లల నిపుణులు ఇక్కడ ఉండడంతో సంగారెడ్డి జిల్లాతో పాటు పక్కనున్న వికారాబాద్, మెదక్ జిల్లాల నుంచి కూడా కాన్పు కోసం గర్భిణీలు ఇక్కడికి వస్తున్నారు. మొత్తం మీద సంగారెడ్డి ఎంసీహెచ్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరగడంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది.

అందరి సహకారంతో 

అందరి సహకారంతో రికార్డు స్థాయిలో ప్రసవాలు చేశాం. ఎంసీహెచ్ డాక్టర్లు, సిబ్బంది సమష్టి కృషి అభినందనీయం. సాధారణ ప్రసవాలే టార్గెట్ గా చేసుకొని వైద్యులు పనిచేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం ఇక్కడి వైద్యులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనం.

అనిల్ కుమార్, సూపరింటెండెంట్ జీజీహెచ్, సంగారెడ్డి