పెర్త్ ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో కమ్మిన్స్ సేన 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో అద్భుతమైన ఆటతీరుతో గెలుపొందిన భారత జట్టు.. రెండో టెస్టులో కనీస పోరాటం చూపలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇరు విభాగాల్లోనూ చేతులెత్తేసింది.
పింక్‌బాల్‌పై భారత యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం ఒక ఎత్తైతే.. టీమిండియా ఓటమికి మరిన్ని కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జట్టు ఎంపికలో లోపాలు
పెర్త్ టెస్టులో రాణించిన ఒకే ఒక్క ఆటగాడు.. నితీష్ రెడ్డి. ప్రత్యర్థి బౌలర్ల దాటికి టాఫార్డర్ బ్యాటర్లు విఫలమైనా.. నేనున్నానంటూ తెలుగోడు కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో నితీశ్ ఇన్నింగ్స్ ఎంతో విలువైనదే. 42 పరుగుల చొప్పున ఇరు ఇన్నింగ్స్ లలోనూ ఒకే పరుగులు చేశాడు. ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న.. అశ్విన్ ఎంపిక. తొలి టెస్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది.
Also Read:- ఆహా ఎంత మంచోళ్లు.. గొడవను పరిష్కరించుకున్న సిరాజ్ - హెడ్
నిలకడ లేని బ్యాటింగ్
రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమికి ప్రధాణంగా.. బ్యాటింగ్ వైఫల్యం కారణమని చెప్పుకోవాలి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. తొలి టెస్ట్ సెంచరీ హీరోలు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ మ్యాచ్ లో రాణించకపోవడం బాగా దెబ్బతీసింది. ఎప్పటిలానే భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో నిలబడటమే అయిష్టంగా కనిపించాడు. ఇక పంత్, గిల్, రాహుల్ త్రయం మంచి ఆరంభాలు లభించినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.
బౌన్సర్లు ఆడలేకపోవటం
బౌన్సర్లు ఆడటంలో భారత బ్యాటర్లది ఎప్పుడూ తడబాటే. అడిలైడ్‌లోనూ అదే కనిపించింది. పింక్ బాల్ అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో భారత బ్యాటర్లు వాటిని ఎదుర్కోవడంలో తడబడ్డారు. అదే అదునుగా స్టార్క్, కమిన్స్ బోలాండ్ బౌన్సర్లు విసురుతూ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
సొంతగడ్డపై హెడ్ డామినేషన్
అడిలైట్ టెస్టులో ఇరు జట్లలో ప్రధాన తేడా.. ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్. ఈ మ్యాచ్‌లో హెడ్ (140) భారీ సెంచరీ చేశాడు. హోమ్ కండీషన్స్, అలవాటు పడిన వాతావరణం, అడిలైడ్ పిచ్‌పై అవగాహన ఉండటంతో చెలరేగిపోయాడు.అతనితో పాటు లబుషేన్ రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చింది.
భారత బౌలర్ల వైఫల్యం
ఈ మ్యాచ్ ఓటమిలో బ్యాటర్ల వైఫల్యం ఎంతనో.. బౌలర్లది అంతే. కంగారూలతో పోలిస్తే భారత బౌలింగ్ అటాక్ చాలా బలహీనంగా కనిపించింది. బుమ్రా మినహా ఏ ఒక్కరూ ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేక పోయారు. సిరాజ్.. గొడవలే పనిగా పెట్టుకుంటే, హర్షిత్ రాణా జట్టులో ఎందుకున్నాడో అర్థం కానీ ప్రశ్న. ఈ తప్పులు సరిదిద్దుకుంటే.. తదుపరి టెస్టుల్లో టీమిండియాకు డోకా ఉండదు. లేదంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కల.. కలగానే మిగిలిపోతుంది.