Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ప్రస్తుతం ఎవ్వరి షెడ్యూలైనా బిజీబిజీనే, రోజూ... ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. చాలామందికి తినడానికి కూడా సమయం దొరకట్లేదు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అలా సమయం తప్పి ఎప్పుడు పడితే అప్పుడు తినడం, రోజూ ఒకే సమయానికి తినకపోవడం వల్ల జీర్ణశక్తి పాడవుతోంది. దానివల్లే కడుపులో గ్యాస్ తయారై చాలా రకాల ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గ్యాస్ వల్ల వచ్చే చాతి నొప్పి అంతాఇంతా కాదు. తీసుకునే ఆహారంలో జంక్ఫుడ్ ఎక్కువగా ఉండటం కూడా సమస్యకు ప్రధాన కారణం.

సా ధారణంగా మనిషి రోజుకు కనీసం ఐదారు సార్లైనా గ్యాస్ విడుదల చేస్తూ ఉంటాడు. కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్యాస్ విడుదల కాకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యల వల్ల అదనంగా గ్యాస్ తయారై తీవ్రమైన నొప్పి రావొచ్చు. పేగుల్లో తయారయ్యే గ్యాస్లో ఆక్సిజన్ తో పాటు చాలారకాల వాయువులు ఉంటాయి. గ్యాస్ తయారవ్వడం అనేది సహజమైన శారీరక క్రియ. కాబట్టి దాన్ని అడ్డుకోలేకపోయినప్పటికీ... తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల ఈ గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు.

కారణాలు

  • మాట్లాడేటప్పుడు, ఆహారం మింగేటప్పుడే కాకుండా ఆందోళనగా ఉన్నప్పుడు కూడా గాలి అసంకల్పితంగా లోపలికి వెళ్తుంది.
  • ఆహారాన్ని నమలకుండా గబగబా మింగడం, చూయింగ్ గమ్ వంటి వాటిని అదే పనిగా నమలడం, స్ట్రాతో ద్రవ పదార్థాలను తాగటం వల్ల కూడా గ్యాస్ లోపలికి వెళ్తుంది.
  • ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా వాటిని పులిసిపోయేలా చేసి గ్యాస్ విడుదల చేస్తుంది.
  • పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు, బీన్స్, చిక్కుడు, బఠాణీ తదితర పీచు పదార్థాలు అరగకపోవడం వల్ల గ్యాస్ ఏర్పడుతుంది.
  • సోడా, శీతల పానీయాలు, బీర్ వంటి గాలి నిండిన కార్బొనేటెడ్ పానీయాలను తీసుకోవటం.
  •  కొవ్వు పదార్థాలు తినటం, కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది. జీర్ణాశయం నుంచి ఆహారంత్వరగా పేగుల్లోకి వెళ్లకుండా కొవ్వు అడ్డుకుంటుంది. దీంతో కడుపు నిండుగా అనిపిస్తుంది.
  • ఒత్తిడి, ఆందోళన, పొగతాగడం, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి.
  •  యాంటీ బయాటిక్స్ ని అతిగా వాడటంకూడా సమస్యను పెంచుతుంది (ఇవి
  • మంచి చేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి). 
  • విరేచనాలు తగ్గడానికి మందులు వాడటం (వీటివల్ల పేగు కదలికల్లో తేడాలు జరుగుతాయి).
  •  గోధుమల్లోని గ్లూటెన్ అనే జిగురు పదార్థాన్ని శరీరం సరిగా జీర్ణించుకోలేకపోవడం గ్లూటెన్ ఇన్స్టాలరెన్స్).
  •  ఆహారంలో కలిపే కృత్రిమ పదార్థాలు పడకపోవటం (బబుల్ గమ్స్, షుగర్ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్, మ్యానిటాల్ వంటి పదార్థాలు పడకపోవటం)    

 లక్షణాలు

గ్యాస్ సమస్య ఉన్నవాళ్లకి ఎప్పుడుపడితే అప్పుడు గ్యాస్ విడుదల కావొచ్చు. గ్యాస్ వల్ల కడుపునొప్పి వస్తుంది. కడుపులో నొప్పి చాలా తీవ్రంగా ఉండి, ఒక్కోసారి పొట్ట కండరాలు పట్టేసినట్లు, ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస్ వల్ల వచ్చే కడుపునొప్పి పొట్టలో ఒక్క చోటే రాదు, పొట్ట ఉబ్బరంగా నిండిపోయినట్లు బిగుతుగా అనిపించడం గ్యాస్ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతోనే పొట్ట వచ్చినట్లు, మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • గ్యాస్ని తయారు చేసే ఆహార పదార్థాలనుమానేయాలి. గ్యాస్ కలిగించే ఆహార పదార్థాలు ఇవే. చిక్కుళ్లు, ఉల్లిగడ్డ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, యాపిల్స్, గోధుమపిండి, కోడిగుడ్లు, శెనగపిండివంటకాలు మొదలైనవి. 
  • వేపుడు, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు ఆమ్లాశయంలో వేగంగా కదలవు. దీంతో పొట్ట నిండినట్లు అనిపించి ఉబ్బరంగా ఉంటుంది.
  • పీచు పదార్దాలను ఆహారంలో నెమ్మదిగా, తక్కువ మోతాదులో తీసుకుంటూ క్రమంగా పెంచాలి. పీచు పదార్ధాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. అలాగే పాలను మానేయడం లేదా తగ్గించడం చేయాలి. పాలకు బదులు పెరుగు వాడొచ్చు. పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవాలి.
  • పుదీనాలో ఉండే మెంథాల్ (పిప్పర్్మంట్) జీర్ణావయవాల కండరాలను వదులు చేస్తుంది. దానివల్ల గ్యాస్ బయటకు విడుదలవుతుంది. అయితే ఒకవేళ ఎసిడిటీ ఉంటే పుదీనాలోని మెంథాల్ సమస్యను ఎక్కువ చేసే అవకాశం ఉంది.

జీవన విధానం మారాలి

ఆహారాన్ని ఎప్పుడూ తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి. బబుల్ గమ్ నమలడం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి. ఆందోళన, గాబరా, హడావిడిగా ఉన్నప్పుడు తినకపోవడం మంచిది. ఎందుకంటే ఆహారాన్ని ఎప్పుడూ నెమ్మదిగా తినాలి. వేళకు ఆహారం తీసుకుంటూ... నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా నిల్వ ఉంచిన పచ్చళ్లు తినొద్దు. అలాగే మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ధ్యానం, యోగా చేయాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. రోజూ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు, పండ్లు తినాలి. టీ, కాఫీలు పూర్తిగా మానెయ్యాలి.