అగ్రి చట్టాల రద్దు కోసం 2024 వరకు పోరాడుతం

అగ్రి చట్టాల రద్దు కోసం 2024 వరకు పోరాడుతం
నాగ్ పూర్/న్యూఢిల్లీ: అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ 2024 మే వరకు ఆందోళన కొనసాగించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాజేశ్ టికైట్ చెప్పారు.  మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరపై లీగల్ గ్యారంటీ ఇవ్వాలన్నారు. ఆదివారం నాగ్ పూర్ మీడియాతో మాట్లాడారు. మూడు చట్టాలను రద్దుచేయాలని కిందటేడాది నవంబర్ 26 నుంచి రైతులు ధర్నా చేస్తున్నారని చెప్పారు. 2024 మే వరకు ధర్నా కొనసాగించేందుకు ప్రిపేర్ అయినట్టు తెలిపారు. ధనిక రైతులే ఆందోళన చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. ‘ఇది రైతులు ఢిల్లీ నుంచి ప్రారంభించిన ఐడియాలాజికల్ రెవల్యూషన్. ఫెయిల్ కాదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోకుండా రైతులు తిరిగి వెళ్లరు. చట్టాల రద్దుకు కేంద్రం ఒప్పుకోవట్లేదు. ఆందోళన చాలాకాలం జరుగుతుంది’ అని అన్నారు. తమకు మద్దతు తెలిపినవారికి ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. చట్టాలను వెనక్కి తీసుకునేది లేదు: తోమర్ అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తప్ప రైతులు ఏదైనా అడగాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చట్టాలను వెనక్కి తీసుకోబోమని స్పష్టంచేశారు. చాలామంది రైతులు, ఎక్స్ పర్ట్స్ అగ్రికల్చర్ రీఫామ్స్ కు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు స్టే కారణంగా ఇప్పుడు చట్టాలను అమలు చేయలేకపోతున్నామని అన్నారు. మంగళవారం జరిగే చర్చల్లో కొత్త చట్టాలపై  క్లాజ్ లవారీగా చర్చలకు రెడీ అని చెప్పారు. ‘మండీలు, ట్రేడర్ల రిజిస్ట్రేషన్ ఇతర అంశాలపై చర్చిస్తామని రైతు సంఘాలకు ప్రపోజల్ పంపాం. పంట వ్యర్థాలు తగలబెట్టడాన్ని నిషేధించే చట్టం, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చట్టాలపైనా చర్చిస్తామని స్పష్టం చేశాం. అగ్రి చట్టాల రద్దు డిమాండ్ కే పట్టుబట్టడం సరికాదు’ అని తోమర్ అన్నారు. రేపు సుప్రీంకోర్టు కమిటీ ఫస్ట్ మీటింగ్ అగ్రి చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మంగళవారం తొలిసారి సమావేశం కానుంది. ఢిల్లీలోని పూసా క్యాంపస్ లో మీటింగ్ ఉంటుందని కమిటీ మెంబర్, షెట్కారీ సంఘటన్ (మహారాష్ట్ర) ప్రెసిడెంట్ అనిల్ ఘన్వత్ ఆదివారం వెల్లడించారు. కేవలం మెంబర్లు మాత్రమే సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ అగ్రి చట్టాలు, ఢిల్లీ బార్డర్లలో రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. అగ్రి చట్టాల అమలుపై ఈ నెల 12న స్టే విధించిన సుప్రీంకోర్టు.. సమస్య పరిష్కారానికి నలుగురు మెంబర్ల కమిటీ వేసింది. అగ్రికల్చర్ చట్టాలకు మద్దతు తెలిపినవారినే కమిటీలో మెంబర్లుగా వేశారంటూ రైతు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ, ఇతర ఆందోళనలను ఆపాలంటూ ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం వేసిన పిటిషన్ పైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.