దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసు విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో …. ఆయేషా మృతదేహానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీపోస్టుమార్టం నిర్వహిస్తోంది. 12 ఏళ్ల కిందట హాస్టల్లో అయేషాను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించారు. ఆరు నెలల కిందటే ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారు. అయితే మత పెద్దలు అంగీకరించలేదంటూ ఆయేషా తల్లిదండ్రులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఆయేషా తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లడంతో రీపోస్టుమార్టం చేయడానికి అనుమతి లభించింది.
విజయవాడ ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న ఆయేషాను 2007 డిసెంబర్ 27న హత్య చేశారు. ఈ కేసులో అప్పట్లో నిందితుడిగా ఉన్న సత్యంబాబును… 2008 ఆగస్టు 11న అరెస్టు చేశారు. కేసు విచారించిన విజయవాడ మహిళా సెషన్స్ ప్రత్యేక కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత 2017 మార్చి 31న సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు తీర్పునిచ్చింది. ఎనిమిదేళ్ల జైలు శిక్ష తర్వాత సత్యంబాబు విడుదలయ్యాడు. మరోవైపు 2018లో హైకోర్టు ఆయేషా కేసును సీబీఐ విచారణకు ఆదేశించింది. 2019 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభించింది.
