ఇప్పుడైనా పర్మిషన్ వచ్చేనా..!

  • మెదక్ మెడికల్ కాలేజీ కోసం ఎన్ఎంసీకి మళ్లీ దరఖాస్తు
  • ఆశగా ఎదురుచూస్తున్న జిల్లా వాసులు

మెదక్, వెలుగు: మెదక్ మెడికల్ కాలేజీకి ఇప్పుడైనా పర్మిషన్ వస్తుందా అని జిల్లా వాసులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొన్ని అంశాల్లో లోటుపాట్లు ఉన్నాయని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ హోల్డ్ లో పెట్టగా లోటు పాట్లను సరిదిద్ది  డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) మరోమారు ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 లో మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. కాలేజీ ఏర్పాటు కోసం రూ.180 కోట్లు కేటాయించగా అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. జిల్లా అధికార యంత్రాంగం కాలేజీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. 

రెవెన్యూ అధికారులు మెడికల్ కాలేజీ కోసం పట్టణ శివారులోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎదురుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. బిల్డింగ్ ల నిర్మాణం పూర్తి కావడానికి సమయం పడుతుందని తాత్కాలికంగా పిల్లి కొట్టాల్​లోని పాత కలెక్టరేట్ బిల్డింగ్ లో మెడికల్ కాలేజీ నిర్వహించాలని నిర్ణయించారు. ఎంబీబీఎస్​స్టూడెంట్స్ కు క్లాస్ లు నిర్వహించేందుకు వీలుగా డిపార్ట్ మెంట్ల వారీగా విభాగాలు ఏర్పాట్లు చేశారు. మెడికల్ టెస్ట్ ల కోసం ల్యాబ్ సౌకర్యం కల్పించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్ లో అవసరమైన రిపేర్లు చేసి సౌకర్యాలు కల్పించారు. మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ నియామకం కావడంతో పాటు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు చేపట్టారు. 

2024- -–25 అకాడమిక్ ఇయర్ లో  కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం పర్మిషన్ కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేసింది. రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేస్తే  వాటిని పరిశీలించిన ఎన్ఎంసీ బృందం అందులో  నాలుగింటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది నియామకాలు జరగలేదని, కొన్ని లోటు పాట్లు ఉన్నాయని చెప్పి నాలుగు మెడికల్ కాలేజీల పర్మిషన్ ను హోల్డ్ లో పెట్టింది.  అందులో మెదక్ మెడికల్ కాలేజీ ఒకటి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సూచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ వో తదితర అధికారులు మెడికల్ కాలేజీ బిల్డింగ్, జిల్లా ఆస్పత్రి, ఎంసీహెచ్ లను పరిశీలించి లోటు పాట్లు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నారు. 

అలాగే ఆయా విభాగాలకు అవసరమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, మినిస్టీరియల్ స్టాఫ్ నియామకానికి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు మెడికల్ కాలేజీ పర్మిషన్ కోసం ఎన్ఎంసీకి మళ్లీ దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో త్వరలోనే ఎన్ఏంసీ బృందం ఆయా మెడికల్ కాలేజీలను సందర్శించే అవకాశం ఉంది. మెదక్ మెడికల్ కాలేజీకి ఈసారి కచ్చితంగా పర్మిషన్ లభిస్తుందని వైద్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.