- దేశంలో జరుగుతున్న టాప్ డిజిటల్ పేమెంట్స్ ఫ్రాడ్స్ బయటపెట్టిన ఆర్‌బీఐ
- పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని వార్నింగ్
బిజినెస్ డెస్క్, వెలుగు:దేశంలో డిజిటల్ పేమెంట్లు బాగా పెరిగాయి. యూపీఐ, క్యూఆర్ కోడ్ స్కానింగ్, కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా అనేక మార్గాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరగడంతోనే ఆర్థిక మోసాలు కూడా ఎక్కువయ్యాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ కస్టమర్లలో అవగాహన పెంచుతోంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న టాప్ డిజిటల్ పేమెంట్స్ ఫ్రాడ్స్ గురించి బయటపెట్టింది.
1 ఫిషింగ్
మోసగాళ్లు ఓ డమ్మీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తారు. బ్యాంక్, ఈ–కామర్స్ వెబ్‌సైట్‌లలా ఈ ఫేక్ వెబ్‌సైట్ చూడడానికి రియల్‌గా అనిపిస్తుంది. ఇటువంటి ఫేక్ వెబ్‌సైట్ల లింక్‌లను మెసెజ్‌లు, ఈ–మెయిల్స్, ఇన్‌స్టంట్ మెసెంజర్ల ద్వారా కస్టమర్లకు పంపుతారు. ఈ లింక్స్ ఓపెన్ చేయగానే ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. కస్టమర్ల పర్సనల్ డేటాను ఈ సైట్లు అడుగుతుంటాయి. కస్టమర్లు ఇటువంటి లింక్స్‌ను ఓపెన్ చేసే ముందు వీటి యూఆర్‌ఎల్‌ను చెక్ చేయాలని, పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఆ తర్వాతనే ఎంటర్ చేయాలని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది.
2విషింగ్..
బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ప్రభుత్వ ఉద్యోగిగా మోసగాళ్లు మారువేషం వేసి కస్టమర్లకు ఫోన్లు చేస్తారు. లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతారు. కస్టమర్ల నమ్మకాన్ని పొందేందుకు వారి డేట్ ఆఫ్ బర్త్, వారి పేరు వంటి డిటైల్స్‌ను తమకు తెలుసన్నట్టు బయటపెడతారు. పాస్‌వర్డ్స్, ఓటీపీలు, పిన్ నెంబర్లు, కార్డు సీవీవీ నెంబర్‌లను చెప్పాలని కస్టమర్లను ఒత్తిడి చేయొచ్చు. అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్‌ను ఆపడానికని, పెనాల్టీ పడకుండా ఉండాలంటే వెంటనే పేమెంట్ చేయాలని లేదా భారీ డిస్కౌంట్ ఉందని చెప్పి కస్టమర్ల సెన్సిటివ్ డేటాను సేకరించడానికి మోసగాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ డేటాను ఉపయోగించి కస్టమర్ల అకౌంట్‌లోని డబ్బులను కొట్టేస్తారు.
3 గుర్తు తెలియని, వెరిఫై కాని యాప్‌లు
బాగా పరిచయం ఉన్న, వెరిఫై అయిన యాప్‌లకు పోలినట్టి నకిలీ యాప్‌లను మోసగాళ్లు డెవలప్ చేస్తున్నారు. ఇటువంటి యాప్‌ల లింక్‌లను ఎస్‌ఎస్‌ఎస్‌లు, ఈ–మెయిల్స్, సోషల్ మీడియా, ఇన్‌స్టంట్ మెసెంజర్ల ద్వారా సర్క్యూలేట్ చేస్తారు. కస్టమర్లు ఈ లింక్‌లను ఓపెన్ చేయగానే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతుంది. ఒక్కసారి ఇటువంటి ఫేక్ యాప్‌లను కస్టమర్లు డౌన్‌లోడ్ చేసుకుంటే, మన మొబైల్స్, ల్యాప్‌టాప్‌లలోని డేటాను మోసగాళ్లు పొందుతారు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కు వచ్చిన ఓటీపీలు, మెసేజ్‌లు కూడా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
4 ఏటీఎం కార్డులను స్కాన్ చేయడం..
ఏటీఎం మెషిన్లలో కస్టమర్ల కార్డులను స్కాన్ చేసే డివైజ్‌లను మోసగాళ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆర్‌బీఐ చెబుతోంది. కస్టమర్ల ఏటీఎం పిన్‌ను తెలుసుకోవడానికి మోసగాళ్లు డమ్మీ కీప్యాడ్‌ను లేదా చిన్న కెమెరాను ఏటీఎంల దగ్గర అమర్చి ఉండవచ్చు. లేదా మరొక కస్టమర్‌లా నటిస్తూ మీ పక్కన నిలబడి ఉండొచ్చు. ఒక్కసారి ఏటీఎం పిన్ తెలిశాక డూప్లికేట్ కార్డును తయారు చేసి కస్టమర్ల డబ్బులను మోసగాళ్లు దొంగలిస్తున్నారు.
5 స్క్రీన్ షేరింగ్ యాప్‌లతో..
స్క్రీన్ షేరింగ్ యాప్‌ను కస్టమర్లు డౌన్‌లోడ్ చేసుకునేలా మోసగాళ్లు చేస్తున్నారని ఆర్‌బీఐ పేర్కొంది. ఇటువంటి యాప్‌ల ద్వారా కస్టమర్ల మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వంటి డివైజ్‌లను కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారు. కస్టమర్ల ఫైనాన్షియల్ డిటెయిల్స్, సెన్సిటివ్ ఇన్‌ఫర్మేషన్‌ను దొంగిలిస్తున్నారు. ఈ డేటాతో కస్టమర్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్‌లతో మనీని దొంగిలిస్తున్నారు.
6సిమ్‌లను మార్చడం..డూప్లికేట్ సిమ్‌లు
బ్యాంక్‌ల దగ్గర రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ల సిమ్ కార్డులను మోసగాళ్లు క్రియేట్ చేస్తున్నారు. ఒరిజినల్ సిమ్‌ను ఫేక్ సిమ్‌తో మార్చడం లేదా కస్టమర్ల దగ్గర ఉండే లాంటి సిమ్‌ను మరొకటి తయారు చేయడమో చేస్తున్నారు. దీంతో కస్టమర్లకు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీలను మోసగాళ్లకు కూడా అందుబాటులో ఉంటున్నాయి. కస్టమర్ల అకౌంట్‌లోని మనీని కొట్టేస్తున్నారు. టెలిఫోన్ లేదా మొబైల్ నెట్‌వర్క్ స్టాఫ్‌లా మారువేషం వేసి కస్టమర్ల దగ్గర నుంచి డేటాను మోసగాళ్లు సేకరిస్తున్నారు. 3జీ నుంచి 4జీకి ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తామంటు, సిమ్ కార్డుపై అదనపు బెనిఫిట్స్‌ను ఇస్తామంటూ కస్టమర్ల డేటాను మోసగాళ్లు సేకరిస్తున్నారు.
7గూగుల్ నుంచి డేటా సేకరించి..
గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ, ఆధార్ అప్‌డేషన్ సెంటర్‌లలో పనిచేస్తున్నట్టు మోసగాళ్లు తమని తాము లిస్ట్ చేసుకుంటున్నారు. కస్టమర్లు ఏదైనా హెల్ప్ కోసం వీరికి కాల్ చేస్తే, కస్టమర్ల దగ్గర నుంచి సెన్సిటివ్ ఇన్‌ఫర్మేషన్‌ను సేకరిస్తున్నారు. వెరిఫికేషన్ కోసం కార్డు నెంబర్లు, పిన్, ఓటీపీలు చెప్పాలని కస్టమర్లను నమ్మిస్తున్నారు.
8క్యూఆర్ కోడ్ స్కాన్..
కస్టమర్లకు క్యూఆర్ కోడ్‌లను పంపించి వీటిని స్కాన్ చేసేలా మోసగాళ్లు చేస్తున్నారని ఆర్‌బీఐ పేర్కొంది. ఇటువంటి క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేశాక వారి డేటాను మోసగాళ్లు సేకరిస్తున్నారు. వారి అకౌంట్లలోని మనీని విత్‌డ్రా చేస్తున్నారు.
9సోషల్ మీడియాలో మారు వేషం
తెలిసిన వ్యక్తిలా మోసగాళ్లు సోషల్ మీడియాలో పరిచయం అవ్వొచ్చు. లేదా తెలిసిన వ్యక్తి అకౌంట్ల నుంచి చాట్ చేయడం, కాల్స్ చేయడం చేయవచ్చు. మెడికల్ ఎమెర్జెన్సీ ఉందని, ఇతరత్ర కారణాలు చూపి వెంటనే డబ్బులు పంపాలని మోసగాళ్లు కోరవచ్చు. మరోవైపు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి మీకు మోసగాళ్లు దగ్గరవ్వొచ్చని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది. ఏదైనా పర్సనల్ లేదా ప్రైవేట్ ఇన్‌ఫర్మేషన్‌ను షేర్ చేస్తే, దాన్ని చూపి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడం లేదా డబ్బులు గుంజడం చేయవచ్చని పేర్కొంది.
