జరిమానా, వడ్డీ రద్దు చేయాలి : గణపతి రెడ్డి

  • రైస్​మిల్​ఇండస్ట్రీని ప్రభుత్వం కాపాడాలి 
  • రా రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి 

మెదక్, వెలుగు: రైస్​మిల్లర్లు ఎవరూ ఉద్దేశ్య పూర్వకంగా సీఎంఆర్​ ఆలస్యం చేయలేదని, అందువల్ల 25 శాతం జరిమానా, వడ్డీ రద్దు చేసి రైస్​మిల్​ ఇండస్ట్రీని కాపాడాలని రా రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రెడ్డి  ప్రభుత్వాన్ని కోరారు. శనివారం పట్టణంలోని రైస్ మిల్లర్ అసోసియేషన్ లో జరిగిన రా రైస్​మిల్లర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. 2019 –- 20, 2020–-21 సీజన్లలో కరోనా కారణంగా లేబర్, హమాలీలు లేకపోవడం, గోదాములు ఖాళీలేకపోవడం, కెపాసిటీకి మించి ధాన్యం కేటాయించడం వంటి కారణాలతో సీఎంఆర్​ కొంత ఆలస్యమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ప్రొక్యూర్​మెంట్​ఆగిపోయి, మిల్లుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం పాడైందన్నారు.

 ముఖ్యంగా క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్​ చేస్తే 65 కిలోల బియ్యం రావాల్సి ఉండగా 62, 63 కిలోలు మాత్రమే వస్తోందని దీనివల్ల మిల్లర్లకు నష్టం వాటిళ్లుతోందన్నారు. ఇవేవి పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం సీఎంఆర్​ ఆలస్యంగా ఇచ్చారని 25 శాతం పెనాల్టి విధించడం, 12 శాతం వడ్డీ చెల్లించాలనే నిబంధన మిల్లర్లకు గుదిబండలా మారిందన్నారు. పెనాల్టీలు, వడ్డీలు, కేసులతో మిల్లర్లు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని, వనపర్తి జిల్లాలో ఇద్దరు మిల్లర్లు గుండెపోటుతో చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తామెవరికి వ్యతిరేకం కాదని మిల్లర్ సమస్యల పరిష్కారం కోసమే రా రైస్​ మిల్లర్లందరం ఏకమై అసోసియేషన్​ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించి రైస్​ మిల్​ ఇండస్ట్రీని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గణపతి రెడ్డి కోరారు. 
   
జిల్లా అధ్యకులుగా వీరేశం

రా రైస్ మిల్లర్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వీరేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను గణపతి రెడ్డి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో ఏరియా రైస్​ మిల్​ అసోసియేషన్​ బాధ్యులు బోనాల శ్రీనివాస్​, లక్షణ్​, రమేశ్​చందర్, అశోక్​, వెంకటేశం, రమేశ్, వెంకన్న పాల్గొన్నారు.