వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య

  • రంగారెడ్డి జిల్లా కొత్తగూడలోని మామిడి తోటలో వృద్ధ దంపతుల మర్డర్‌‌‌‌
  • నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో మరో వృద్ధుడు..

ఇబ్రహీంపట్నం, వెలుగు : మామిడి తోటకు కాపలా ఉంటున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌‌‌‌లోని చింతలపల్లికి చెందిన మనోహర్‌‌‌‌రావుకు కొత్తగూడలో ఐదెకరాల మామిడి తోట ఉంది. ఈ తోటకు కాపలాగా నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన మూగ ఉషయ్య (70), శాంతమ్మ (65) దంపతులు రెండేండ్లుగా పనిచేస్తున్నారు.

బుధవారం ఉదయం 6.30కి మనోహర్‌‌‌‌రావు ఫోన్‌‌‌‌ చేయగా ఎవరూ లిఫ్ట్‌‌‌‌ చేయలేదు. దీంతో కొత్తగూడకు చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌‌‌‌ చేసి తోట వద్దకు వెళ్లి చూడాలని చెప్పాడు. ఆయన 8 గంటల టైంలో తోట వద్దకు వెళ్లి చూడగా గదిలో శాంతమ్మ, 200 మీటర్ల దూరంలో ఊషయ్య చనిపోయి కనిపించారు. శాంతమ్మ తల, మెడ వెనుక, ఊషయ్య తల వెనుక, వీపు భాగంలో పొడిచిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అతడు మనోహర్‌‌‌‌రావు, పోలీసులకు ఫోన్‌‌‌‌ చేసి విషయం చెప్పాడు. హత్యా స్థలాన్ని క్లూస్‌‌‌‌ టీం, డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ పరిశీలించి వివరాలు సేకరించాయి.

చోరీకి వచ్చిన వారు ఇంత దారుణంగా చంపే అవకాశం లేదని, హత్యకు పాత కక్షలేమైనా కారణమై ఉంటాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీతారాం తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి మూడు టీమ్స్‌‌‌‌ను ఏర్పాటు చేశామని మహేశ్వరం జోన్‌‌‌‌ అడిషనల్​డీసీపీ సత్యనారాయణ చెప్పారు. 

నల్గొండ జిల్లాలో వృద్ధుడి హత్య

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం నారాయణపురంలో ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కాకనూరి కొండయ్యగౌడ్ (63) బుధవారం తన ఇంట్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఆటోలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. గ్రామ శివారులోకి తీసుకెళ్లి కత్తులతో దాడి చేశారు.

కొన ఊపిరితో ఉన్న కొండయ్యను స్థానికులు గమనించి హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అయితే భూ తగాదాల హత్యకు  కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలిసిన వారే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మిర్యాలగూడ రూరల్‌‌‌‌ సీఐ వీరబాబు, మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్య పరిశీలించారు.