హైదరాబాద్, వెలుగు: త్రిపుర జనానికి డిజిటల్ సేవలను అందజేసేందుకు అక్కడి ప్రభుత్వంతో చేతులు కలిపామని రామ్ఇన్ఫో తెలిపింది. ఈ రాష్ట్ర ప్రజలకు ఈ–గవర్నెన్స్ సౌకర్యాలను అందించడానికి 27 మొబైల్ కామన్ సర్వీస్ సెంటర్‌లను (సీఎస్సీ) ప్రారంభించామని పేర్కొంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో రామ్ఇన్ఫో లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ 27 మొబైల్ సీఎస్సీలను త్రిపుర రాష్ట్ర ఉప– ముఖ్యమంత్రి శ్రీ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 25న అగర్తలలోని సుకాంత అకాడమీలో అధికారికంగా ప్రారంభించారు.
త్రిపుర రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీలకు, విలేజ్ కౌన్సిల్‌లలో మొబైల్ నెట్‌వర్క్ లేదు. ఈ ప్రాంతాలను కవర్ చేయడానికి, పౌరుల ఇంటి వద్దకే ఈ–-గవర్నెన్స్ సేవలను అందించడానికి మొబైల్ సీఎస్సీ ఉపయోగపడుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తామని రామ్ ఇన్ఫో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ప్రతి మొబైల్ సీఎస్సీలో ల్యాప్‌టాప్‌లు, ఆల్ఇన్ వన్ ప్రింటర్లు, ఫోటో ప్రింటర్లు, పీవీసీ కార్డ్ ప్రింటర్‌లతో పాటు ఫింగర్ బయోమెట్రిక్ స్కానర్లు వంటి పరికరాలు ఉంటాయి.
