అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. భక్తులు ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటాయి. మరోవైపు 400 కేజీలకు పైగా వెండి ఇటుకలు అందాయని రామ మందిర ట్రస్టు తెలిపింది. వెండి ఇటుకలతో ఇప్పటికే బ్యాంకు లాకర్లు నిండిపోయాయని… ఇకపై వచ్చే ఇటుకలను స్టోర్ చేసేందుకు స్థలం లేదని ట్రస్టు ప్రకటించింది. ఇకపై వెండి ఇటుకలను ఎవరూ పంపించొద్దని కోరింది.
మందిర నిర్మాణంలో ఉపయోగించేందుకు దేశ నలువైపుల నుంచి భక్తులు ఇటుకలను పంపుతున్నారు. అయితే వచ్చే వెండి ఇటుకలతో లాకర్లు కూడా నిండిపోయాయని… వాటిని భద్రపరచడంపై తాము ఆందోళనకు గురవుతున్నామని రామ మందిర ట్రస్టు చెప్పింది. విరాళాలు ఇవ్వాలనుకుంటున్న భక్తులు వాటిని డబ్బు రూపంలో ఇవ్వాలని కోరింది. మందిర నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని… ఈ సమయంలో మెటల్ రూపంలో విరాళాలు అవసరం లేదని భక్తులకు తెలిపింది.
