రామాలయం నిర్మిస్తే హిందూ లీడర్​ కాలేరు : మోహన్ భగవత్ 

  • ఆర్​ఎస్ఎస్ చీఫ్​ మోహన్ భగవత్ 

ముంబై : మన దేశ ప్రజలంతా సామరస్యంతో కలిసి మెలిసే ఉంటున్నారనే విషయాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆలయాలు–మసీదులపై కొత్త కొత్త వివాదాలు ఇటీవల గణనీయంగా పెరగడం బాధాకరమన్నారు. పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 'ఇండియా- ది విశ్వగురు' అనే అంశంపై మోహన్ భగవత్ మాట్లాడారు. మత సామరస్యంతో కూడిన సమాజాన్ని సమర్థించారు. "మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది.

అందులో భాగంగానే రామకృష్ణ మిషన్‌‌‌‌లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. హిందువులు మాత్రమే ఇలాంటి మత సామరస్య కార్యక్రమాలు చేస్తారు. మన దేశం చాలా కాలంగా సామరస్యంగా ఉంటున్నది. ఈ సామరస్యాన్ని ప్రపంచానికి అందించాలంటే దానికి ఒక నమూనాను రూపొందించాలి. రామాలయం నిర్మిస్తే హిందూ లీడర్​ కాలేరు" అని భగవత్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం రాచరిక పాలనలో లేదని రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నదని చెప్పారు.

ప్రభుత్వాన్ని నడిపే ప్రతినిధులను ప్రజలే ఎన్నుకున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమేనని వెల్లడించారు. ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు ఆరాధించడమే ఈ దేశ ఆచారమని స్పష్టంచేశారు. అందరూ నిబంధనలు, చట్టాలకు లోబడి జీవించడం చాలా అవసరమని భగవత్ పేర్కొన్నారు.