Jithender Reddy Review: జితేందర్‌రెడ్డి మూవీ రివ్యూ.. 72 బులెట్లు దిగిన నాయకుడి బయోపిక్ ఎలా ఉందంటే?

రాకేష్ వ‌ర్రే హీరోగా న‌టించిన ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ జితేందర్‌రెడ్డి (Jithender Reddy). జగిత్యాలకు చెందిన నాయకుడు, దివంగత ABVP లీడర్ జితేందర్ రెడ్డి అలియాస్ జిత్తన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇవాళ శుక్రవారం (నవంబర్ 8న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో కీలక పాత్ర వహించిన నేత లైఫ్‌లోని కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని జితేందర్ రెడ్డి పేరుతోనే సినిమాను నిర్మించారు. 

కథేంటంటే::

1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యధార్ధ గాథ ఇది. జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్‌ రెడ్డి (రాకేశ్‌ వర్రె) కీలక పాత్ర పోషించారు. ఆయన చిన్నప్పటి నుంచి దేశం, ప్రజల కోసం పనిచేయాలని తపన పడుతుంటారు. ఈ క్రమంలో నక్సలైట్స్ చేత హత్యకు గురైన ఒక 18 యేళ్లు లేని కుర్రాడిని చూసి ఆయనకు విపరీతంగా కోపం వస్తుంది. ఇక నక్సలైట్స్ లోకి వెళ్ళొద్దని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం చేస్తాడు.

ఈ క్రమంలోనే  భూమి కోసం, పీడిత ప్రజల బాగు కోసం గన్నులు చేత పట్టినట్టు చెప్పుకునే నక్సలైట్స్ దారితప్పినట్టు గుర్తించడం.. ఇలా చివరివరకు నక్సలైట్స్ పై వ్యతిరేకంగా ఎలా పోరాడారో? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? ఈ క్రమంలో ఆయన సన్నిహితులపై నక్సలైట్స్ ఎలా ఎన్ కౌంటర్లు జరిపారు?

జితేందర్‌ రెడ్డి ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగాడు? ఇక చివరికి నక్సల్స్‌ చేతుల్లో ఎలా మరణించాడు? ఆయన ప్రేమకథేంటీ?  సీనియర్ ఎన్టీఆర్ ని ఆయన ఎందుకు కలిసాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే::

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ఏబీవీపీ నాయకుడే జితేందర్ రెడ్డి. ఆయన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కానీ, ఇది సినిమా అయినా.. రియాల్సిటిక్ గా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.

ఫస్టాఫ్ జితేందర్ రెడ్డి బాల్యం, కాలేజ్ డేస్, అక్కడ ఆయన లీడర్ గా మారడానికి ప్రేరిపించిన సంఘటనలు చూపించారు. జితేందర్‌ రెడ్డి గురించి ఇప్పటికీ పక్క రాష్ట్రాల ప్రజలకు అంతగా ఎవ్వరికీ తెలియదు. కానీ, ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసేలా.. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు. అదేలా అంటే.. ఊరికి బస్సు వస్తే అభివృద్దా.. ఉన్న బస్సులను తగలబెడితే అభివృద్దా? కొత్త రోడ్లు వేస్తే అభివృద్దా.. ఉన్న రోడ్లను పగలకొడితే అభివృద్దా? విద్వేషాలు ఉసిగొల్పడం అభివృద్దా..ఐక్యంగా ఉండటం అభివృద్దా? వంటి ఈ సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తాయి.

ఇక సెకండ్ హాఫ్ జితేందర్ రెడ్డి వర్సెస్ నక్సలైట్లు, జితేందర్ రెడ్డి పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది? ఇక నక్సలైట్స్ చాలా ఉదృతంగా ఉన్న టైంలో జితేందర్ రెడ్డి పోరాటం ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. క్లైమాక్స్‌ సన్నీవేశాలు, సినిమాలో చూపించే ఎమోషన్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి.

ఇక ముఖ్యంగా జితేందర్ రెడ్డిని నక్సలైట్లు 72 బులెట్లు శరీరంలోకి దింపి చంపారని ఆయన రియల్ ఫొటోలు కూడా సినిమా క్లైమాక్స్ లో చూపించడం గమనార్హం. దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. సమాజం మనకు ఏం ఇచ్చిందనేది కాదు. మనం సమాజానికి ఏం ఇచ్చాము అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

ఎవరెలా చేశారంటే::

రాకేష్ వర్రే 'జితేందర్ రెడ్డి' పాత్రలో జీవించేశాడు. జాతీయవాదిగా యాక్షన్ సీక్వెన్స్ ల్లో అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్‌ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. స్వయంసేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్‌గా ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతిక అంశాలు::

గోపి సుందర్‌ మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వి.ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రామకృష్ణ అర్రం ఎడిటర్‌ గా చక్కని ప్రతిభ కనబరిచారు. దర్శకుడు విరించి వర్మ మరియు నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి సినిమా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ఇలాంటి సినిమాలు తీయాలంటే.. కంటెంట్ ఉంటే సరిపోదు. చాలా ధైర్యం ఉండాలి. అది ఉందని నిరూపించారు.