అవినీతి మంత్రులపై సీఎం దృష్టి పెట్టాలి : ఆర్. కృష్ణయ్య

  • ఫీజు బకాయిలపై రేపు చలో కలెక్టరేట్​ పిలుపు

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల నుంచి 8– 14 శాతం కమీషన్ తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. అవినీతికి పాల్పడుతూ కమీషన్లు తీసుకునే మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.  హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఫీజు బకాయిల్లో రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంఘం నేతలు నందగోపాల్, రాందేవ్ మోదీ రాజు నేత , వీరన్న, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.