Rajinikanth: నన్ను రాజకీయ ప్రశ్నలు అడగొద్దు.. రిపోర్టర్‌పై రజనీకాంత్ అసహనం.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ మంగళవారం (జనవరి 7న) తెల్లవారుజామున విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రజనీకాంత్ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగవద్దని ఘాటుగా చెప్పారు. అసలేమైంది..రజినీ ఎందుకలా స్పందించారనేది వివరాల్లోకి వెళితే..

దర్శకుడు లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్న 'కూలీ'(Coolie) సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ థాయిలాండ్‌లో జరగనుంది. ఇందులో భాగంగా రజినీకాంత్ థాయిలాండ్‌ వెళ్తున్నారు.

అయితే, ఇవాళ ఉదయం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజినీ మీడియాతో మాట్లాడారు. అక్కడ ఓ రిపోర్టర్ చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను ఉద్దేశిస్తూ ప్రశ్న వేశారు. ఈ నేపథ్యంలో రిపోర్టర్ మహిళల భద్రతపై ప్రశ్నించగా.. రజనీకాంత్ తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ | Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఎంత..?

అలాగే కూలీ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఏంటని రిపోర్టర్స్ అడగ్గా.. సమాధానం ఇచ్చారు తలైవా." ఇప్పటివరకు 70% షూటింగ్ పూర్తయింది. ప్రస్తుత షెడ్యూల్ జనవరి 13 నుండి జనవరి 28 వరకు జరగనుంది..త్వరలోనే సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి " అని బదులిచ్చారు. రజినీ కాంత్ కూలీ సినిమాలో ‘దేవా’ అనే పాత్రలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర,  శ్రుతిహాసన్, సత్యరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.