రజనీ తప్పుకోవడం హ్యాపీ.. కమల్‌‌‌‌‌కు అంత సీన్ లేదు

రజనీ తప్పుకోవడం హ్యాపీ.. కమల్‌‌‌‌‌కు అంత సీన్ లేదు
చెన్నై: తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. తమిళనాడులో డీఎంకేతో కలసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన జోస్యం పలికారు. రాజకీయ పార్టీ పెట్టొద్దని సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకున్న నిర్ణయంతోపాటు కమల్ హాసన్ ఫ్యూచర్‌‌పైనా కార్తీ కామెంట్స్ చేశారు. ‘తమిళనాడులో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అలవోకగా విజయం సాధించబోతోంది. నేను రాష్ట్రమంతటా పర్యటించా. ప్రజలతో మాట్లాడా. అందరూ మార్పుకే మొగ్గు చూపుతున్నారు. అధికార అన్నాడీఎంకే మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీతో ఆ పార్టీ జట్టు కట్టడం జనాలకు నచ్చడం లేదు. ఇక రజనీ విషయానికి వస్తే.. ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగారని అనుకోవట్లేదు. కానీ మళ్లీ ఆయన పాలిటిక్స్‌‌లోకి వస్తే మాత్రం అదృష్టం వెక్కిరించడం ఖాయం. రజనీ వెళ్లిపోవడం సంతోషకరం. తన పార్టీ విషయంలో కమల్ హాసన్ ఎక్కువగా ఊహిస్తున్నట్లు అనిపిస్తోంది. తనతో సెల్ఫీలు దిగేవారిని చూసి ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో. ఓటింగ్ పరంగా ఇది ఎలాంటి ప్రభావం చూపించదు. అన్నాడీఎంకే విషయంలో జైలు నుంచి శశికళ విడుదలైన తర్వాత ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతున్నదనేది కీలకం’ అని కార్తీ చిదంబరం పేర్కొన్నారు.