రాజస్థాన్: ఇటీవలే CRPF జవాన్లపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ పేలుడు తర్వాత పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం వైమానిక దాడులు చేపట్టి 300కు పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కొన్ని రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనతో పాక్ లో విమానయాన సేవలు రద్దయి… ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఇరుదేశాల మధ్య ఏర్పడిన పరిస్థితుల క్రమంలో త్వరలో జరుగాల్సిన పెళ్లి వేడుక రద్దయింది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా ఖేజాద్ కా పార్ గ్రామానికి చెందిన వరుడు, పాకిస్థాన్ లోని అమర్ కోట్ జిల్లా సినోయ్ కు చెందిన వధువు మధ్య వివాహ వేడుక జరగాల్సి ఉంది. శనివారం జరుగనున్న ఈ పెళ్లి వేడుక కోసం వరుడి తరుపు బంధువులు థార్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేశారు. పాక్ లోని లాహోర్-భారత్ లోని అట్టారి మార్గాల మధ్య ఈ రైలు సేవలందిస్తుంది. అయితే తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పాక్ అధికారులు ఈ రైల్వే మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పెళ్లికి ఆటంకం ఏర్పడింది.
దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. వరుడి తరపు బంధువు ఒకరు మాట్లాడుతూ.. “మేము వీసా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. వీసాల కోసం మంత్రి గజేంద్రసింగ్ ను సంప్రదించాం. ఐదుగురికి మాత్రమే వీసా ఇప్పించారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులందరికి శుభలేఖలు అందజేశాం. పెళ్లికంటే దేశ రక్షణే ముఖ్యం” అని చెప్పుకొచ్చారు. భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దు ప్రాంతాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పడిపుడే తగ్గుముఖం పడుతున్నాయి.
