7 నెలల పసికందుకు వాతలు పెట్టిన తాంత్రికుడు

7 నెలల పసికందుకు వాతలు పెట్టిన తాంత్రికుడు

జైపూర్: జ్వరం, జలుబుతో బాధపడుతున్న 7 నెలల పసికందుకు నయం చేస్తానని చెప్పి ఇనుప రాడ్డుతో వాత పెట్టాడో తాంత్రికుడు. రాజస్థాన్​లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ దారుణం. మధ్యప్రదేశ్​లోని నెమంచ్​కు చెందిన శంభు భీల్.. భిల్వారాలోని దాదాబరి కాలనీలో భార్య, ఏడు నెలల కొడుకుతో కలిసి ఉంటున్నాడు. కొద్ది రోజులుగా ఆ పసివాడు జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. శంభు భార్య గురువారం ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లగా దగ్గర్లో ఉన్న తాంత్రికుడి దగ్గరకు కొడుకును తీసుకెళ్తే జబ్బు నయం చేస్తాడని చెప్పారు. దీంతో కొడుకును తీసుకొని తల్లి ఆ తాంత్రికుడి దగ్గరకు వెళ్లింది. అయితే, ఆ తాంత్రికుడు బాబుకు నయం చేస్తానంటూ కాల్చిన ఇనుప రాడ్డుతో వాత పెట్టాడు. దీంతో ఆ పసివాడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే బాబును గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకొని తాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.

వేడి చైనుతో మహిళను కొట్టి..

గుజరాత్​లోని ద్వారక జిల్లా అరంభడ గ్రామానికి చెందిన రమిల సోలంకి(25) తన భర్త వలతో కలిసి బుధవారం ఒఖమధి గ్రామానికి వెళ్లింది. అక్కడ సడెన్​గా రమిల వణకడం ప్రారంభించింది. దగ్గర్లో ఉన్న భూత వైద్యుడు రమేశ్​ సోలంకి దగ్గరకు తీసుకెళ్లగా.. నయంచేస్తానంటూ వేడి వేడి ఇనుప చైనుతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ దెబ్బలకు ఆమె మృతిచెందింది.