క్రికెట్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘర్షణ 15 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసింది. ఓడిపోయానన్న బాధలో ప్రత్యర్థి జట్టు ఆటగాడు బ్యాట్‌తో కొట్టడంతో ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం(ఫిబ్రవరి 6) భవానీ మండి పట్టణంలోని రాజస్థాన్ టెక్స్‌టైల్స్ మిల్స్ లేబర్ కాలనీకి చెందిన రెండు వర్గాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రకాష్ సాహు అనే యువకుడి జట్టు విజయం సాధించింది. దీంతో వారు సంబరాలు చేసుకుంటుండగా, ప్రత్యర్థి జట్టు ఆటగాడు ముఖేష్ మీనా (20) సదరు యువకుడి తలపై వెనుక నుంచి బ్యాట్‌తో దాడి చేశాడు. ఈ ఘటనతో సాహు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు కోటాకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి యువకుడు మృతి చెందాడు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
దాడికి పాల్పడ్డ నిందితుడిని అదే కాలనీకి చెందిన ముఖేష్ మీనా (20)గా గుర్తించిన పోలీసులు, అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. బుధవారం తెల్లవారుజామున కొందరు స్థానికులు నిందితుడి బైక్‌ను ధ్వంసం చేశారు. అతని కుటుంబ సభ్యులను ఓ గదిలో బంధించారు. దీంతో పోలీసులు అక్కడే తిష్టవేసి ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
