ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు

ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు
  • అనారోగ్య సమస్యలున్నందున తగిన ఆసుపత్రిలో చికిత్స చేయించాలన్న హైకోర్టు
  • చికిత్స అనంతరం కోలుకున్నాక తిరిగి జైలుకు పంపాలని హైకోర్టు ఆదేశం

జోధ్ పూర్: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపు తాత్కాలిక బెయిల్ పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఆయన తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల కరోనా సోకడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. క్వారెంటైన్ పూర్తయినందున తీసుకెల్లవచ్చని ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న తాను హరిద్వార్ లో ఆయుర్వేద వైద్యం చేయించుకునేందుకు అనుమతించాలని.. దీని కోసం తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆశారాం బాపు హైకోర్టును కోరారు. పిటిషన్ పై విచారించిన రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ దేవేంద్ర కచ్వాహా డివిజన్ బెంచ్  తీర్పు వెలువరిస్తూ బెయిల్ అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే అనారోగ్య సమస్యల కోసం మెరుగైన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఆరోగ్యం బాగుపడిన వెంటనే తిరిగి జైలుకు తీసుకెళ్లాలని, జైలులో మంచి పౌష్టిక ఆహరం.. సురక్షితమైన వాతావరణంలో ఆయనను ఉంచాలని స్పష్టం చేసింది.