రాజస్థాన్‌‌‌‌ కేబినెట్​లో 29 మంది మంత్రులు

రాజస్థాన్‌‌‌‌ కేబినెట్​లో 29 మంది మంత్రులు

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇప్పటివరకు కేబినెట్ లో 21 మంది మంత్రులు ఉండగా, ఆదివారం జరిగిన విస్తరణలో మంత్రుల సంఖ్యను తనతో సహా 30కి పెంచారు. కొత్త కేబినెట్ లో సీఎం సహా 19 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. స్టేట్ అసెంబ్లీలో 200 సీట్లు ఉండగా, గరిష్టంగా 30 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు వీలుంది. తాజా విస్తరణతో స్టేట్ కేబినెట్ లో బెర్తులు ఫుల్ అయ్యాయి. గవర్నర్ కల్ రాజ్ మిశ్రా సమక్షంలో 11మంది కొత్త కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సర్కారులో గెహ్లాట్ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరుడు తిరుగుబాటు చేసిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ క్యాంప్​లో 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఐదుగురికి తాజాగా మంత్రి పదవులు దక్కాయి.

గత కేబినెట్ లో 21 మంది మంత్రులు ఉండగా, 9 మంది మంత్రి పదవులు గల్లంతయ్యాయి. కొత్తగా 12 మందికి చాన్స్ దొరికింది. 2019లో క్రైసిస్ సందర్భంగా పార్టీని కాపాడిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. బీఎస్పీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆరుగురిలో ఒకరికి మాత్రమే పదవి దక్కింది. కొత్త కేబినెట్​లో నలుగురు దళితులకు, ముగ్గురు మహిళలకు మంత్రులుగా చాన్స్ దొరికింది. ప్రమాణ స్వీకారం తర్వాత గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వంటి అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా మంత్రివర్గంలో మార్పులు జరిగాయని తెలిపారు.  

కొత్త కేబినెట్ సూపర్: సచిన్ పైలట్ 
సీఎం అశోక్ గెహ్లాట్ కొత్త కేబినెట్ పట్ల పార్టీ రాష్ట్ర నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుందన్నారు. కొత్త కేబినెట్​లోకి ఆయా వర్గాల వారిని తీసుకున్న తీరుతో రాష్ట్రంలో పార్టీ కేడర్​కు పాజిటివ్ మెసేజ్ వెళ్లిందని అభిప్రాయపడ్డారు. పార్టీలో ఎంలాంటి గ్రూపులు లేవని, కేబినెట్ విస్తరణపై అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.