శ్రీగంగానగర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో జీపులోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీగంగానగర్ జిల్లాలోని రాజియాసర్ ఏరియాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. జీపు హనుమాన్‌గఢ్ జిల్లాలోని సంగేరియా పట్టణానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన వారు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని స్టేషన్ ఇంచార్జ్ విక్రమ్ తివారి తెలిపారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నామని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజియాసర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించామని చెప్పారు.
