జగన్ మినీ వైఎస్ ఆర్: రాజశేఖర్, జీవిత

జగన్ మినీ వైఎస్ ఆర్: రాజశేఖర్, జీవిత

వైఎస్ జగన్ విజయంలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జగన్ గెలుపునకు ప్రజలే కారణమని, జగన్ కు ఓటు వేసిన ప్రజలందరికి వారు ధన్యవాదాలు  తెలిపారు. జగన్ మినీ వైఎస్ ఆర్ అని ఈ సందర్భంగా అన్నారు.

పార్టీలు మారితే తప్పేంటి?: రాజశేఖర్

పార్టీలు మారే అంశంపై రాజశేఖర్ మాట్లాడుతూ, పార్టీలు మారితే తప్పేంటి? ఓటర్లు ఒక పార్టీకే ఓటేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో ఎన్నికల్లో ఇంకో పార్టీకి వేస్తారని, అలాగే, సందర్భాన్ని అనుసరించి తాను పార్టీలు మారానని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, ఆ పార్టీ నేత నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయలేదని ఆయన అన్నారు.  పవన్ తాను పోటీ చేసిన స్థానాల్లో ఒక్క సీటైనా గెలిస్తే బాగుండేదని రాజశేఖర్ అన్నారు. వైసీపీలో తమ పాత్ర ఏంటన్నది.. ఎలా ఉంటుందన్నది ఇంకా తెలియదని రాజశేఖర్ అన్నారు.

జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు: జీవిత

ప్రజలు చాలా తెలివిగా కేంద్రంలో ఎన్డీఏను, రాష్ట్రంలో వైకాపాను గెలిపించారని నటి జీవిత అన్నారు. జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారని, ప్రజలు ఒక అవకాశం ఇచ్చి చూద్దామనుకునే జగన్ కు ఓటేశారని ఆమె అన్నారు. జగన్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తారని ఆమె అన్నారు. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాని జీవిత ఈ సందర్భంగా అభిలాషించారు.

సోషల్ మీడియాలో కొందరు నాగబాబుకు, తమకు గొడవలున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. తమ కుటుంబంపై విచక్షణ రహితంగా దుర్భాషలాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ వ్యాఖ్యలు తమని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని జీవిత అన్నారు.