హెడ్మాస్టర్ల సంఘం..స్టేట్ ప్రెసిడెంట్​గా రాజ్ గంగారెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (జీహెచ్ఎంఏ) స్టేట్ ప్రెసిడెంట్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన రేకులపల్లి రాజ్ గంగారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్  పీఎన్ఎం హైస్కూల్ లో  జీహెచ్ఎంఏ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. స్టేట్ జనరల్ సెక్రటరీగా సిద్దగోని గిరిధర్, ట్రెజరర్ గా బి.తుకారం ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాజ్ గంగారెడ్డి మాట్లాడుతూ... విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం ప్రయత్నం చేసి హెడ్మాస్టర్లకు ప్రమోషన్లు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. విద్యారంగంలోని సమస్యల పరిష్కారానికి, హెడ్మాస్టర్ల సమస్యల పరిష్కారం కోసం సర్కారుకు విన్నవిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.