
- పత్తి రైతుల్లో చిగురించిన ఆశలు
- జోరందుకున్న వరి నాట్లు
- గతేడాది కంటే తగ్గిన పత్తి సాగు
యాదాద్రి/నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం పంటలకు ప్రాణం పోసింది. ప్రధానంగా పత్తి రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సీజన్మొదట్లోనే విత్తడానికి రెండుమార్లు పెట్టుబడి, కలుపు తొలగించడానికి మరోసారి పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పటికీ గండం గట్టెక్కామని ఆనందంలో మునిగిపోతున్నారు. వరి సాగు విషయంలోనూ వెనకాముందైన రైతులు.. వానలు కురుస్తుండడంతో నాట్లు వేస్తున్నారు.
వానాకాలం దోబూచులాట..
మేలో వాన పలకరించడంతో రైతులు సంబురంతో పత్తి విత్తనాలు వేశారు. ఆ తర్వాత జూన్ మొత్తం. జూలైలో మూడో వారం వరకు వానలే పడలేదు. మొదట్లో వేసిన విత్తనాలు కొన్ని చోట్ల భూమిలోనే మాడిపోగా, మరికొన్ని చోట్ల పెరగాల్సిన ఎత్తులో మొక్కలు పెరగలేదు. దీంతో కొందరు రైతులు రెండోసారి విత్తారు. ఈ పరిణామాలతో పత్తి సాగును పెంచాలని అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రయత్నాలు ఫలించలేదు. గతేడాది యాదాద్రి జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, విత్తనాలు విత్తే సమయం ముగిసేనాటికి (జూలై 15) కేవలం 80 వేల ఎకరాల్లోనే విత్తనాలు వేశారు.
మళ్లీ వానలు పడకపోవడంతో పత్తి సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వస్తుందా.? అని భయపడ్డారు. ఈ సమయంలో గడిచిన వారం రోజులుగా తరచూ పడుతున్న వానలతో విత్తే సమయం మించిపోయినా మరో 18 వేల ఎకరాల్లో విత్తనాలు వేశారు. మొత్తంగా 98 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 6,40,567 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 5,02,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. సూర్యాపేట జిల్లాలో 90 వేల ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేసిన అధికారులు ఇప్పటివరకు 60 వేల ఎకరాల్లో సాగు చేశారు.
సాధారణం కంటే తక్కువే..
యాదాద్రి జిల్లాలో శుక్రవారం అక్కడడక్కడ మోస్తారు వాన కురిసింది. జిల్లా వ్యాప్తంగా 8.1 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షాపాతం కంటే తక్కువ వాన కురిసింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 208.8 మిల్లీ మీటర్లు వాన కురియాల్సి ఉండగా, ఇప్పటివరకు 204.0 నమోదైంది. ఇప్పటికీ రెండు శాతం వర్ష పాతం తక్కువే నమోదైంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7.09 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 2003 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 262.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఊపందుకున్న వరి నాట్లు..
సమయానుకూలంగా వానలు కురియకపోవడంతో వరి సాగు చేసే రైతులు కూడా వెనుకడుగు వేశారు. యాదాద్రి జిల్లాలో 2.95 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాల కాస్త తలకిందులయ్యింది. మొత్తంగా ఇప్పటివరకు 1.15 లక్షల ఎకరాల్లోనే నాట్లు వేశారు. అయినప్పటికీ ఇంకా 1.80 లక్షల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉంది. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం వరి సాగులో వెనుకబడి ఉంది. నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యం కావడం, మరోవైపు వర్షాలు సమయానికి కురియకపోవడంతో గ్రౌండ్ వాటర్ పైనే ఆధారపడి నాట్లు పెట్టారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, మరోవైపు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తుండడంతో వరి నాట్లు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 5,25,350 ఏకరాలల్లో వరి సాగు అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటివరకు కేవలం 65,284 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. సూర్యాపేట జిల్లాలో 4.82 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేయగా ఇప్పటివరకు 1.03 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు.
ఈ సీజన్ సాగు అంచనా, చేసిన సాగు ఎకరాల్లో..
యాదాద్రి జిల్లా
పంట సాగు అంచనా సాగు చేసింది
వరి 2.95 లక్షలు 1.15 లక్షలు
పత్తి 1.15 లక్షలు 98 వేలు
కంది 6000 2102
నల్గొండ జిల్లా
పంట సాగు అంచనా సాగు చేసింది
వరి 5,25,350 65,284
పత్తి 6,40,567 5,02,641
కంది 10,000 1545
పెసర 1,200 166
సూర్యాపేట జిల్లా
వరి 4,82,000 1.03,000
పత్తి 90,000 62,312
కండి 10,000 6,000
పెసర 9,000 6,000