పెద్ద వాన పడితే దడదడే!

  • మెదక్, రామాయంపేట పట్టణాల్లో తీవ్ర ఇబ్బందులు

మెదక్, రామాయంపేట, వెలుగు: జిల్లాలోని మెదక్, రామాయంపేట మున్సిపల్ పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో భారీ వర్షాలు పడితే రోడ్లు, వీధులు జలమయం అవుతున్నాయి. నీరు భారీగా నిలువడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. ఏండ్లుగా ఈ సమస్య ఉన్న మున్సిపల్ పాలకవర్గాలు, అధికారులు సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భారీ వర్షాలు పడినప్పుడల్లా ఇబ్బందులు తప్పడం లేదు. 

మెదక్​లో...

జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడితే రాందాస్ చౌరస్తా, ఎంజీ రోడ్డు, పాత గాంధీ లైబ్రరీ వద్ద పెద్ద  ఎత్తున నీరు నిలుస్తోంది. దీంతో రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బైక్​లు కొట్టుకుపోతున్నాయి.  పాత గాంధీ లైబ్రరీ పక్కన ఉన్న పలు షాప్​ల్లోకి నీరు చేరుతోంది. ఆటోనగర్​లో సైతం రోడ్డు జలమయం అవుతోంది. వెంకట్రావ్ నగర్, సాయినగర్ కాలనీల్లో ఇళ్ల మధ్యన పెద్ద మొత్తంలో నీరు నిలుస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే పెద్ద వర్షం పడ్డప్పుడల్లా ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచి జన జీవనానికి ఆటంకం కలుగుతుంది. 

రామాయంపేటలో... 

రామాయంపేట పట్టణంలోని బస్తీలు చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. పట్టణంలోని అక్కల బస్తీలో డ్రైనేజీ సక్రమంగా లేక వర్షం పడితే వీధులన్నీ జలమయం అయ్యి మురికి నీరంతా ఇళ్లలోకి చేరడంతో..   ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే సిద్దిపేట రోడ్డులోని ముత్తూట్ ఫైనాన్స్ , సీతయ్య గుడి ప్రాంతం వర్షం నీరు రోడ్డుపై నిలిచి ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటితో పాటు పెద్ద వర్షం పడితే బీసీ కాలనీలోని తహసీల్దార్ ఆఫీస్, ఫైర్ స్టేషన్ కార్యాలయం, ఎస్సీ బాలికల వసతి గృహం పూర్తిగా వర్షం నీటితో నిండి పోతోంది. ప్రతి ఏటా వర్షా కాలంలో ఇదే పరిస్థితి నెలకొంటున్నా సమస్య పరిష్కారానికి చర్యలు కరువయ్యాయి.