IND vs BAN 2024: టీమిండియాకే నష్టం.. కాన్పూర్ టెస్టుకు భారీ వర్ష సూచన

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 1 వరకు టెస్టు జరగనుంది. రిపోర్ట్స్ ప్రకారం తొలి మూడు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. శుక్రవారం 90 శాతం.. శనివారం 80 శాతం వర్ష సూచన ఉన్నట్టు సమాచారం. మూడో రోజైన ఆదివారం 50 శాతం వర్షం పడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం పడితే రోజు మొత్తం ఆట జరగకపోవచ్చు. 

 తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేద్దామనుకుంటే నిరాశ తప్పేలా లేదు. ఈ మ్యాచ్ రద్దయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు కొంత నష్టం జరిగినట్టే. బలహీనమైన బంగ్లాదేశ్ తో స్వదేశంలో మ్యాచ్ డ్రా గా ముగిస్తే కీలకమైన 6 పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది. తొలి టెస్టులో ఆడిన స్క్వాడ్ నే రెండో టెస్టుకు సెలక్ట్ చేశారు. ప్లేయింగ్ 11 లో కూడా ఎలాంటి మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు. 

Also Read:-యూఏఈ బయలుదేరిన భారత మహిళల క్రికెట్ జట్టు

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. నాలుగో రోజు తొలి సెషన్ లో ముగిసిన టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఈ సిరీస్ లో బోణీ కొట్టింది.భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే పరిమితమైంది.   దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు గిల్ (119), పంత్ (109) సెంచరీలతో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ 4 వికెట్లకు 287 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 515 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆలౌటైంది.