నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. దీంతో పాటు రైల్వేలను కూడా కేంద్రం ప్రైవేట్ పరం చేయనుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆయన లోక్ సభలో ఓ చర్చ సందర్భంగా తెలిపారు. రైల్వే శాఖ ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుందని తెలిపారు.
అయితే మరింత మెరుగైన కార్యకలాపాల కోసం రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు పియూష్ గోయల్. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సంయుక్త భాగస్వామ్యంతోనే దేశం అత్యున్నత స్థాయిలో పురోగామి పథంలో పయనిస్తుందని, భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశముందని చెప్పారు.
