భారత్‌ గౌరవ్ రైళ్లు: 180 టూరిస్ట్ సర్క్యూట్‌ ట్రైన్లు

భారత్‌ గౌరవ్ రైళ్లు: 180 టూరిస్ట్ సర్క్యూట్‌ ట్రైన్లు

దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రాంతాలను కలుపుతూ 180 టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్స్‌ను ప్రారంభించబోతున్నట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ ఉన్న ప్యాసింజర్, కార్గో రైళ్లకు అదనంగా ఇకపై టూరిజం ట్రైన్లు కూడా మొదలుపెట్టబోతున్నామన్నారు. భారత్ గౌరవ్ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ రైళ్ల కోసం 3 వేల 33 కోచ్‌లను సిద్దం చేశామని ఆయన చెప్పారు. ఇవి రెగ్యులర్ రైళ్లు కావని, ప్రత్యేక టూరిస్టు సర్క్యూట్ రైళ్లని అన్నారు. సుసంపన్నమైన భారత సంప్రదాయాన్ని, వారసత్వ సంపదను, చారిత్రక ప్రాంతాలను దేశ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చే టూరిస్టులకు తెలియజేయాలన్న ప్రధాని మోడీ విజన్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ రైళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో ఉన్న టూరిస్టు ప్రాంతాల ప్రత్యేకత ఆధారంగా థీమ్ బేస్డ్‌ ట్రైన్లను అందుబాటులోకి తెస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ టూరిజం ట్రైన్లను ఐఆర్సీటీసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సెక్టార్‌‌ వాళ్లు కూడా ట్రైన్లను ఆపరేట్ చేయొచ్చని చెప్పారు. ఈ ట్రైన్లను నడపాలనుకునే వారి నుంచి అప్లకేషన్లను స్వీకరిస్తున్నామని, వాటిలో ఎంపికైన వారు రైళ్లను అవసరమైన తీరుగా మార్చుకోవచ్చిన వైష్ణవ్ చెప్పారు. ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ ట్రైన్లపై ఆసక్తి చూపుతున్నాయన్నారు.