గుడ్ న్యూస్.. రైల్వేలో 32 వేల ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు..

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. లెవెల్-1 పోస్టుల భర్తీకి రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. రైల్వేలో దాదాపు 32 వేల లెవెల్-1 ఉద్యోగాలకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 23, 2025 నుంచి మొదలుకానుంది. ఫిబ్రవరి 22, 2025తో అప్లికేషన్ ప్రాసెస్ గడువు ముగుస్తుంది. అంతేకాదు.. రైల్వేలో ఈ లెవెల్-1 ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల విద్యార్హతలను రైల్వే బోర్డు సడలించింది.

ఇంతకు ముందు రైల్వేలో ఈ లెవెల్-1 (గ్రూప్-డి) ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే పదో తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు ఐటీఐ డిప్లొమా గానీ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే.. తాజాగా రైల్వే బోర్డు విద్యార్హతకు సంబంధించిన ఈ నిబంధనలో మార్పులు చేసింది. రైల్వేలో లెవెల్-1 ఉద్యోగాలకు ఇకపై టెన్త్ క్లాస్ పాసైతే చాలు లేదా ఐటీఐ లేదా ఎన్సీవీటీ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్. వీటిల్లో ఏ ఒక్క అర్హత ఉన్నా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లెవెల్-1 పోస్టులకు సంబంధించి భవిష్యత్లో జరిగే రిక్రూట్మెంట్స్కు కూడా ఈ సడలింపు వర్తిస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

టెన్త్ క్లాస్ మాత్రమే పాసై.. పరిస్థితులు అనుకూలించక అంతటితో చదువు ఆపేసిన వారికి ఈ సడలింపు వల్ల రైల్వేలో ఉద్యోగానికి ప్రయత్నం చేసే అవకాశం ఇకపై దక్కనుంది. ఈ లెవెల్-1 పోస్టుల్లో ఏఏ ఉద్యోగాలు ఉంటాయంటే.. రైల్వేలోని పలు డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్లు, పాయింట్స్మెన్, ట్రాక్ మెయింటెనర్స్.. ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రైల్వే బోర్డు చేసిన తాజా సడలింపు ఒక మంచి సదవకాశం. 32 వేల పోస్టుల భర్తీకి రైల్వే బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్కు స్పందించి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేస్తారో చూడాలి మరి.

అభ్యర్థులను నాలుగు దశల్లో ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. సీబీటీ 1 ఎగ్జామ్, సీబీటీ 2 ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఇవన్నీ దాటుకుని అర్హత సాధించిన వారికి ఉద్యోగం దక్కుతుంది. పే స్కేల్ 18 వేల నుంచి మొదలవుతుంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆర్ఆర్బీ గ్రూప్-డీ రిక్రూట్ మెంట్ అప్లికేషన్ ఫీజు జనరల్/ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు. ఎస్సి/ఎస్టి/ట్రాన్స్ జెండర్/ఈబీసీ అభ్యర్థులకు 250 రూపాయలు. స్టేజ్-1 ఎగ్జామ్ రాసిన తర్వాత జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో 400 రూపాయలు రిఫండ్ అవుతుంది. మిగిలిన కేటగిరీ అభ్యర్థులకు ఫుల్ అమౌంట్ రిఫండ్ అవుతుంది.