పర్భనీ బాధితుడి ఇంటికి రాహుల్.. ఫైర్ అయిన బీజేపీ

ముంబై: పర్భనీ హింసాకాండ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో మరణించిన బాధితుడి కుటుంబాన్ని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కలిశారు. వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. మహారాష్ట్ర పర్భనీలో రైల్వే స్టేషన్ బయట డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో రాజ్యాంగ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి సోమనాథ్ సూర్యవంశీ సహా 50మందికిపైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పర్భనీ జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు సోమనాథ్ అనారోగ్యానికి లోనయ్యారు. 

అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో సోమనాథ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని కోరారు. రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయన పర్యటనను మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్, రెవెన్యూ మినిస్టర్ చంద్రశేఖర్ బవాన్​కులే డ్రామాగా అభివర్ణించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పర్యటన రాజకీయ మైలేజ్ కోసం చేసిన నాటకమే తప్ప మరొకటి కాదని వెల్లడించారు.  

ఘర్షణలపై జ్యుడీషియల్ విచారణ

పర్భనీ హింసాకాండపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. కస్టడీలో తనను హింసించలేదని మేజిస్ట్రేట్​కు సోమనాథ్ చెప్పారని ఫడ్నవీస్ పేర్కొన్నారు.