అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్‌లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ

ఈ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం అలంపూర్ జనజాతర సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తేమని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతం మంది ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. 

అంబేడ్కర్, నెహ్రు, గాంధీలు కృషితో రూపొందించిన రాజ్యాంగ వల్లనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, బహుజనులకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ బీజేపీ తీసేయాలని కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. మోదీ అదానీ, అంబానీ లాంటి వ్యాపారులకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు, కానీ రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్  అధికారంలోకి రాగానే ఫస్ట్ కుల గణన చేస్తామని హామి ఇచ్చారు. 

స్త్రీలు ఇంటి పనితో పాటు బయట పని చేయడానికి కూడా వెళ్తున్నారని, మొత్తం 18 గంటలు పని చేస్తున్నారని కానీ, స్త్రీలు ఇంట్లో పని చేసినందుకు ఎలాంటి జీతం రావట్లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రతి మహిళలకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ పూర్తైన విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ అన్నారు.