- అమిత్‌షా కామెంట్స్‌పై మండిపడ్డ రాహుల్ గాంధీ
- కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
- మంత్రి పదవిలో నుంచి తొలగించాలన్న ఖర్గే
- ఉభయ సభలలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు
న్యూఢిల్లీ: బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తే దేశం సహించబోదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై రాజ్యసభలో మంగళవారం అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కు, ఆయన ఐడియాలజీకి, రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమని అన్నారు.
బాబా సాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత. దేశానికి మార్గం చూపిన మహనీయుడు. ఆయనకు గానీ, ఆయన రూపొందించిన రాజ్యాంగానికి గానీ అవమానం జరిగితే దేశం సహించదు. అందుకే హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందే” అని రాహుల్ డిమాండ్ చేశారు. ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ.. అంబేద్కర్ పేరుతోనే హక్కులు పొందుతామని, ఆయన పేరు చెప్పుకోవడం కోట్లాదిమంది దళితులు, అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు.
అమిత్ షాను బర్తరఫ్ చేయాలి: ఖర్గే
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను అవమానించేలా మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారని, అందుకుగాను ఆయన దేశానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ చీఫ్మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. బుధవారం పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన సందర్భంగా ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దళితులు దేవుడిగా భావించే అంబేద్కర్‌ను అవమానించారు. షా వ్యాఖ్యలు తప్పు అని చెప్పాల్సిన మోదీ ఆయనను వెనకేసుకు వస్తున్నారు” అని ఫైర్ అయ్యారు.
ఉభయసభల్లో రచ్చ
అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్లపై బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ.. ప్రతిపక్ష సభ్యులు జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. కౌంటర్‌గా అధికార పక్ష సభ్యులూ నినాదాలు చేయడంతో ఉభయసభలూ గురువారానికి వాయిదాపడ్డాయి.
అమిత్ షాపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు
రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకుగాను రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు ఇచ్చారు. రాజ్యసభ విధి విధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్ 187
కింద ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఫైల్ చేశారు.
పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక, కూటమి పార్టీల ఎంపీలు ధర్నా చేశారు. తెలంగాణ నుంచి ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఇతర ఎంపీలు హాజరయ్యారు. లోక్ సభ లాబీ బయట అంబేద్కర్ చిత్ర పటంతో ఖర్గే, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో పాటు ఎంపీలు నిరసన తెలిపారు.