అసలు జరిగింది ఇది: బీజేపీ ఎంపీని తోసేయడంపై రాహుల్ గాంధీ క్లారిటీ

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‎పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. అంబేద్కర్‎ను మీరంటే మీరే అవమానించారంటూ పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం (డిసెంబర్ 19) కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పోటాపోటీగా ఆందోళనలకు దిగారు.

ఎదురెదురు పడి మరీ ఇరువర్గాలు నిరసన చేశాయి. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ప్రతాప్ సారంగి కిందపడ్డారు. అయితే.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోసేయడంతోనే తాను కిందపడ్డట్లు సారంగి ఆరోపించారు. రాహుల్ వేరే ఎంపీని తోసేయగా ఆయన తనపై పడటంతో గాయపడ్డానని అన్నారు. 

Also Read :- అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా

బీజేపీ ఎంపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను పార్లమెంటు ప్రవేశద్వారం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను.. కానీ బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకుని పక్కకు తోసేసి బెదిరించారు. ఈ సమయంలో అక్కడ తోపులాట  జరిగింది. ఈ తోపులాటలో బీజేపీ సభ్యుడు కిందపడ్డారు.

 ఉద్దేశపూర్వకంగా నేను ఎవరని తోసేయలేదు’’ అని వివరణ ఇచ్చారు. పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకు ఉంది.. కానీ బీజేపీ ఎంపీలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ సభ్యులు అడుగడుగునా రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.