- ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై రాహుల్ గాంధీ మండిపాటు
- కేంద్రానికి ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టే ఆయుధమని ఆరోపణ
- సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్
ముంబై : ఎలక్టోరల్ బాండ్ల స్కీమును ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికే కేంద్రం ఉపయోగించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ స్కీమ్ రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి వాడిన దోపిడీ రాకెట్ అని అభివర్ణించారు. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శనివారం ఆయన..మహారాష్ట్ర థానేలోని జంభాలి నాకా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "ఎలక్టోరల్ బాండ్ల పథకం.. అంతర్జాతీయ స్థాయి దోపిడీ రాకెట్ వంటింది.
దీనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారికి ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ నుంచి వేధింపులు తప్పవు. ఈ స్కీమ్ ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలను పడగొట్టడానికి, రాజకీయ పార్టీలను ముక్కలు చేయడానికి ఉపయోగించే దోపిడీ రాకెట్ లాంటింది. మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫ్రీగా బీజేపీలోకి వెళ్లలేదు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని తిరుగుబాటుకు ఎలక్టోరల్ బాండ్ల స్కీమే మూలాధారం. కరోనా వ్యాక్సిన్ తయారీకి బాండ్ల రూపంలో ప్రధాని కి భారీగా విరాళాలు వచ్చాయి" అని రాహుల్ వివరించారు.
ప్రజలను అమిత్ షాపై తప్పుదోవ పట్టిస్తున్నరు
బీజేపీకి రూ.6 వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఉండటాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమర్థించుకోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తప్పుపట్టారు. ఎలక్టోరల్ బాండ్లను ఉద్దేశించి అమిత్ షా చెప్పిన అబద్ధాలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మండిపడ్డారు.
పేదలకు ప్రాధాన్యత లేదు
దేశంలోని పేదలకు పరిపాలనలో, ప్రముఖ రంగాల్లో బీజేపీ సర్కార్ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు. "దేశ జనాభాలో వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, సాధారణ వర్గానికి చెందిన పేదలే 80 శాతానికి పైగా ఉన్నారు. కానీ వారేవ్వరూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నతస్థాయిలో కనిపించరు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివాసీ అయినందున అయోధ్య రామ మందిర ఓపెనింగ్ కార్యక్రమానికి పిలవలేదు. సినీ తారలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మాత్రమే అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటివి జరగవు. ఇది నా గ్యారంటీ" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
