రాహుల్‌ పుట్టుకతోనే ధనవంతుడు.. ఆయనకేం తెల్వద్

రాహుల్‌ పుట్టుకతోనే ధనవంతుడు.. ఆయనకేం తెల్వద్
న్యూఢిల్లీ: దేశానికి రైతులు వెన్నెముక లాంటి వారని కేంద్ర మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలకు రాజ్‌‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌‌కు వ్యవసాయం గురించి ఏమీ తెలియదన్నారు. తాను రైతు కుటుంబంలో పుట్టానని చెప్పిన రాజ్‌‌నాథ్.. వ్యవసాయం గురించి రాహుల్ కంటే తనకే ఎక్కువ తెలుసునన్నారు. ‘రాహుల్ జీ నా కంటే వయస్సులో చిన్నవారు. వ్యవసాయం గురించి ఆయన కంటే నాకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే రాహుల్ పుట్టుకతోనే ధనవంతుడు. కానీ నేను ఓ రైతు కుటుంబంలో పుట్టి పెరిగా. మా అమ్మానాన్నలు రైతులు. నేను అన్నదాత బిడ్డను. ప్రధాని మోడీ కూడా ఓ పేద తల్లికి పుట్టిన బిడ్డే. అలాంటి మేం రైతులకు వ్యతిరేకంగా ఎలా నిర్ణయం తీసుకుంటాం? ఈ విషయంలో దీనికి మించి చెప్పాల్సిందేమీ లేదు. రైతులను నక్సల్స్, ఖలిస్తానీలుగా ముద్ర వేయొద్దు. వాళ్లు అన్నదాతలు. వారిని గౌరవించాలి. ఆర్థికంగా దేశం చితికిపోయిన సమయంలో రైతులే ఆదుకున్నారు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రైతులే కారణం’ అని రాజ్‌‌నాథ్ పేర్కొన్నారు.