ఇప్పట్లో రాహుకేతు పూజలు ఉండవు

ఇప్పట్లో రాహుకేతు పూజలు ఉండవు

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు ఇప్పట్లో లేవని తెలిపారు ఈవో చంద్రశేఖర్ రెడ్డి. రాహుకేతు పూజలు చేయించుకునే భక్తులు మరికొంత కాలం ఆగాల్సిందేనన్నారు. ఈ నెల 8వ తేదీన భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి లేదని తెలిపారు. ఏపీ దేవాదాయ కమిషనర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ జోన్ లో ఉన్నందువలన భక్తులకు అనుమతి లేదని… తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు ఆలయ ఈవో.

అంతేకాదు స్వామివారిని అనుమతికి పర్మిషన్ వచ్చిన తర్వాత భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…పాటించాల్సిన నియమాలను తెలిపారు ఆలయాధికారులు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా కరోనా వ్యాధినియంత్రణ ద్వారం ఏర్పాటు చేశామన్నారు.భక్తుల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా క్యూలైన్లో రింగులు ఏర్పాటు చేశామన్నారు. ఆధునిక పద్ధతిలో మొదట థర్మల్ స్కానింగ్,  చేతులు శానిటేషన్, ఆ తర్వాత వ్యాధి నియంత్రణ  ముఖద్వారాల నుంచి  భక్తులు వెళ్తున్నప్పుడు వారిపై  హైడ్రోక్లోరిక్  ద్రావణం స్ప్రేయింగ్  చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డులు తీసుకురావాలని తెలిపారు. అదేవిధంగా మాస్కులు ఖచ్చితంగా ఉండాలని లేని వారిని అనుమతించబోమన్నారు. వీలైనంత వరకు వయసుపై బడిన వారిని, చిన్నపిల్లలను తీసుకురాకుండా ఉండడమే మంచిదని తెలిపారు.