ZIM vs AFG: దాదాపు 100 ఏళ్ల తరువాత.. వికెట్ పడకుండా రోజంతా ఇద్దరే బ్యాటింగ్

బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో ఆఫ్గనిస్తాన్ ద్వయం రహమత్ షా- హష్మతుల్లా షాహిదీ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 361 పరుగులు జోడించారు. వికెట్ పడకుండా రోజంతా ఇద్దరే బ్యాటింగ్ చేశారు. గతంలో ఇలాంటి ఫీట్ దాదాపు వందేళ్ల క్రితం నమోదైనట్లు రికార్డుల్లో ఉంది. ఇంగ్లీష్ బ్యాటర్లు జాక్ హాబ్స్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్ రోజంతా బ్యాటింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.  

టెస్టుల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. రహమత్ షా(231; 23 ఫోర్లు, 3 సిక్స్ లు) డబుల్ సెంచరీ చేయగా.. హష్మతుల్లా షాహిదీ(141; 16 ఫోర్లు) సెంచరీ చేశారు. జింబాబ్వే బౌలర్లలో పసలేకపోవడం, పిచ్ సహకరించకపోవడంతో ఆఫ్ఘన్ ద్వయం చెలరేగిపోయారు. బౌండరీల మోత మోగించారు. టెస్టుల్లో ఒక్క రోజు ఆటంటే.. 90 ఓవర్లు. అన్ని ఓవర్లు అలసట లేకుండా ఇద్దరే ఆడటమంటే మామూలు విషయం కాదు. 

  • 2019 తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో రోజంతా వికెట్ కోల్పోకపోవడం ఇదే మొదటిసారి. 
  • టెస్టు క్రికెట్‌లో జింబాబ్వే బౌలర్లు ఒక్కరోజు అంతా వికెట్లేమీ తీయలేకపోవడం కూడా ఇదే తొలిసారి.

అంతకుముందు జింబాబ్వే బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏకంగా ముగ్గురు సెంచరీలు సాధించారు. సీన్ విలియమ్స్(154), క్రెయిగ్ ఎర్విన్(104), బ్రియాన్ బెన్నెట్(110) శతకాలు బాదారు. దాంతో, జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ లో 586 పరుగుల భారీ స్కోర్ చేశారు.