న్యూఢిల్లీ: నిరుడు ఆస్ట్రేలియా టూర్ లో ఇండియా హిస్టారిక్ టెస్టు సిరీస్ విక్టరీలో స్టాండిన్ కెప్టెన్ అజింక్యా రహానె కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ విక్టరీ క్రెడిట్ మరొకరు కొట్టేశారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రౌండ్‌లో, డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలు తమవేనంటూ మరొకరు మాట్లాడారని మాజీ కోచ్ రవిశాస్త్రిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. అడిలైడ్ ఫస్ట్ టెస్టులో 36 రన్స్ కే ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోహ్లీ ఫ్యామిలీ రీజన్స్‌తో ఇండియాకు రావడంతో రహానె కెప్టెన్సీ అందుకొని సిరీస్‌లో టీమ్‌ను గెలిపించాడు. ‘ఆ సిరీస్‌లో నేనేం చేశానో నాకు తెలుసు. ఆ విషయాలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ తీసుకునే స్వభావం నాది కాదు. అవును.. ఆ సిరీస్ లో గ్రౌండ్‌లోగానీ, డ్రెస్సింగ్ రూమ్ లో కానీ నేను తీసుకున్న నిర్ణయాలు తనవేనంటూ వేరే వాళ్లు క్రెడిట్ కొట్టేశారు. సిరీస్ తర్వాత ఇది నేను చేశా, ఈ నిర్ణయం నేను తీసుకున్నా అంటూ కొందరు మీడియా ముందు మాట్లాడారు. అది వారి ఇష్టం. కానీ గ్రౌండ్‌లో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానో నాకు తెలుసు. నా గురించి, నేను సాధించిన దాని గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోను’ అని రహానె పేర్కొన్నాడు.
