అక్కడి నుండే పోటీ చేస్తానంటున్న రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణమ రాజు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. బీజేపీ తరఫున నరసాపురం నుండి ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు ఆ పార్టీ టికెట్ దక్కలేదు. అయినప్పటికీ తనకు ఆ స్థానం నుండి టికెట్ ఇప్పంచాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని పట్టుబట్టి కూర్చున్నాడు. తాజాగా తన సొంత నియోజకవర్గం భీమవరంలో పర్యటించిన ఆయన తాను పోటీ చేసే స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు రోజులు ఆలస్యమైనా కానీ తనకు నరసాపురం నుండి టికెట్ దక్కుతుంటుందని విశ్వాసం ఉందని అన్నాడు.

తను జైల్లో ఉన్నప్పుడు తన ప్రాణాలు పోకుండా, పదవి పోకుండా కాపాడిన కేంద్ర పెద్దలు తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేయరన్న నమ్మకం ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులతో తనకు పరిచయం కానీ, స్నేహం కానీ లేనందునే టికెట్ దక్కలేదని అన్నారు. తనకు మద్దతుగా కొన్ని వందల ఫోన్లు వచ్చాయని, కూటమి తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి, రఘురామ పోటీ చేసే స్థానంపై నెలకొన్న సస్పెన్స్ ఎప్పటికి వీడుతుందో చూడాలి.