- రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఆర్ధిక నిపుణులతో కమిటీ
చెన్నై: కరోనాతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధిక రంగానికి చెందిన ఆరుగురు ప్రపంచ స్థాయి నిపుణులతో ఒక ఆర్ధిక కమిటీని నియమించారు. సీఎం సలహాదారుగా వ్యవహరించే ఈ కమిటీకి భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వం వహిస్తారు. ఈయనతోపాటు కమిటీలో మసాచుసెట్స్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ ఎస్తర్ డఫ్లో, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, భారతదేశ ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్, 2003 సమయంలో భారత ప్రధానికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన ఎస్ నారాయణ్ కమిటీలో సభ్యులుగా నియమించారు.
కమిటీ సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనాలు చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ మాట్లాడుతూ కమిటీ సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.
