IND vs NZ: రాధా యాదవ్ డైవింగ్ క్యాచ్‌.. కళ్లు తేలేసిన ప్రత్యర్థి బ్యాటర్

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్ రాధ యాదవ్ అద్భుతమైన క్యాచ్‌తో అలరించింది. వెనక్కి పరిగెడుతూ గాల్లోకి డైవ్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకొని ఔరా అనిపించింది. ఈ క్యాచ్ చూసి మైదానంలో ఉన్న ప్రేక్షకులే కాదు.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ సైతం ఆశ్చర్యపోయింది. క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

మ్యాచ్‌కే హైలెట్

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో ప్రియా మిశ్రా వేసిన ఓ బంతిని కివీస్ బ్యాటర్ హాలిడే ఎక్సట్రా కవర్ మీదుగా షాట్‌కు ఆడేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరు. బంతి కూడా బాగానే కనెక్ట్ అయ్యింది. కానీ రాధ యాదవ్ నమ్మశక్యం కానీ క్యాచ్ అందుకొని ఔరా అనిపించింది. మీదుగా వెళ్తున్న బంతిని 30 యార్డ్ సర్కిల్ నుంచి వెనక్కి పరిగెడుతూ సమాంతరంగా గాల్లోకి  డైవ్ చేస్తూ ఒడిసిపట్టింది. ఆ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలుస్తోంది.

ఓటమి దిశగా టీమిండియా 

కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 259 పరుగులు చేయగా.. ఛేదనలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ప్రస్తుతానికి భారత జట్టు 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. చివరి 30 ఓవర్లలో విజయానికి ఇంకా 180 పరుగులు కావాలి.